రామ్‌దేవ్ వర్సెస్ బాగేశ్వర్ బాబా..
కృష్ణుడి వ్యాఖ్యలతో మొదలైన వివాదం..
అఖిలేశ్‌కు అందివచ్చిన అస్త్రం..
2027 ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తలనొప్పి!
యూపీ రాజకీయాల్లో బాబాల పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రాష్ట్రంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంటే.. మరోవైపు ఇద్దరు ప్రముఖ బాబాల మధ్య మొదలైన వివాదం కమలదళానికి కొత్త తలనొప్పిగా మారుతోంది. యోగా గురు బాబా రామ్‌దేవ్.. బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఇద్దరూ బీజేపీకి సన్నిహితంగా ఉండే ఆధ్యాత్మిక ప్రముఖులే. అలాంటిది ఒకరిపై మరొకరు విమర్శలకు దిగడం.. ఆ తర్వాత సయోధ్య కుదుర్చుకోవడం.. ఇదంతా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. అసలే ఎన్నికల వేళ.. ఈ బాబాల పంచాయతీ బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది?
కృష్ణుడిపై వ్యాఖ్యలు.. రామ్‌దేవ్ ఫైర్!
ఈ వివాదానికి కేంద్రబిందువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు. ఓ కథా కార్యక్రమంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడిని పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శ్రీరాముడు సూటిగా ఉంటారని, శ్రీకృష్ణుడు వంకరటింకరగా ఉంటారని ఆయన మాట్లాడిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. ఇది కృష్ణుడి త్రిభంగి భంగిమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యగా భావించినా.. భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరకు ధీరేంద్ర శాస్త్రి క్షమాపణలు చెబుతూ తాను కూడా కృష్ణుడి భక్తుడినేనని స్పష్టం చేశారు.
అయితే ఈ వ్యవహారంపై బాబా రామ్‌దేవ్ తీవ్రంగా స్పందించారు. జంషెడ్‌పూర్‌లో మాట్లాడుతూ ధీరేంద్ర శాస్త్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుళ్లను పోల్చడం ఏమిటని ప్రశ్నించారు. కృష్ణుడిని వంకరటింకరగా అభివర్ణించిన వ్యక్తి.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఏంటని నిలదీశారు. అంతేకాదు.. ధీరేంద్ర శాస్త్రిని 'పాఖండీ' అంటూ విమర్శించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కొద్ది రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ధీరేంద్ర శాస్త్రి రామకథ కార్యక్రమానికి రామ్‌దేవ్ హాజరయ్యారు. ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. అలాంటిది ఇప్పుడు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
విమర్శలు సరే.. ఆ తర్వాత సయోధ్య ఎందుకు?
రామ్‌దేవ్ విమర్శలతో వివాదం మరింత ముదిరేలా కనిపించింది. కానీ నవంబర్ 24న హరిద్వార్‌లో ఆయన మరో ప్రకటన చేశారు. ధీరేంద్ర శాస్త్రితో మాట్లాడానని.. పెద్దరికంతో, ఆప్యాయతతోనే మందలించానని చెప్పారు. బాగేశ్వర్ బాబా తనకు తమ్ముడిలాంటి వాడని, శిష్యుడిలాంటి వాడని వ్యాఖ్యానించారు. అటు ధీరేంద్ర శాస్త్రి కూడా రామ్‌దేవ్ విమర్శలను ఆశీర్వాదంగానే స్వీకరిస్తున్నానని ప్రకటించారు. ఆయన తనకు గురువుతో సమానమని, సాధువుల మధ్య అవమానానికి తావులేదని స్పష్టం చేశారు. అంటే ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగినట్లే. కానీ రాజకీయంగా ఈ వ్యవహారం రేపిన ప్రకంపనలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి.
సమాజ్ వాదీ పార్టీకి అందివచ్చిన అస్త్రం...
ఈ వివాదాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణుడిపై ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యల విషయంలో గతంలోనే ఆయన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. యాదవ సామాజిక వర్గం శ్రీకృష్ణుడిని తమ యదువంశీయ వారసత్వానికి ప్రతీకగా భావిస్తుంది. అందుకే కృష్ణుడిపై వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్‌లో రాజకీయంగా సున్నితమైన అంశం.
ఇప్పుడు రామ్‌దేవ్ సైతం ధీరేంద్ర శాస్త్రిని విమర్శించడంతో ప్రతిపక్షానికి మరో అవకాశం దొరికింది. బీజేపీకి సన్నిహితంగా ఉండే ఆధ్యాత్మిక ప్రముఖుల మధ్యే విభేదాలు వస్తున్నాయంటూ రాజకీయ విమర్శలకు ఆస్కారం ఏర్పడింది.
2027 ఎన్నికలు.. కమలానికి అసలు పరీక్ష!
ఇక్కడే బీజేపీకి అసలు చిక్కు ఉంది. ఉత్తరప్రదేశ్‌లో హిందుత్వ రాజకీయాలు, అయోధ్య రామమందిరం, మథుర కృష్ణ జన్మభూమి వంటి అంశాలు రాజకీయంగా కీలకమైనవి. 2027 ఎన్నికలకు ముందు మథురలో కృష్ణ జన్మభూమి అంశం కూడా చర్చలోకి వస్తోంది. ఇలాంటి సమయంలో కృష్ణుడిపై వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం బీజేపీకి ఇబ్బందికరమైన పరిణామం.
రామ్‌దేవ్‌కు దేశవ్యాప్తంగా భారీ అనుచరగణం ఉంది. ధీరేంద్ర శాస్త్రికి యువతలోనూ, హిందూ ధార్మిక వర్గాల్లోనూ గణనీయమైన ఆదరణ ఉంది. ఇద్దరికీ బీజేపీ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా రాజకీయంగా ఈ వివాదానికి ప్రాధాన్యం తెచ్చింది.
అయితే ఈ వివాదం వల్ల బీజేపీకి నేరుగా ఎన్నికల నష్టం జరుగుతుందని ఇప్పుడే చెప్పలేం. కానీ యూపీలో కుల సమీకరణాలు, మతపరమైన సున్నిత అంశాలు కీలకంగా మారే సమయంలో ఇలాంటి పరిణామాలు పార్టీకి ఇబ్బందికరమైన చర్చను సృష్టిస్తాయి. ఇద్దరు బాబాలు ఇప్పుడు కలిసిపోయారు. వివాదానికి ముగింపు పలికారు. కానీ ఆ వివాదం రాజకీయంగా లేవనెత్తిన ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు.
రంగంలోకి బీజేపీ పెద్దలు...
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పెద్దలు రంగంలోకి దిగినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. అసలే ఎన్నికల సీజన్.. ఆపై దూసుకొస్తున్న ఎస్పీ, కాంగ్రెస్ కూటమి. ఇలాంటి సమయంలో ప్రతి విషయంపైనా ఆచితూచి మాట్లాడాలని పార్టీ శ్రేణులకు కమలనాథులు సూచిస్తున్నారట. పనిలో పనిగా ఆ ఇద్దరు బాబాల మధ్య సయోధ్యకు కూడా ప్రయత్నించినట్టు వార్తలొచ్చాయి. ఐతే వారిద్దరూ కూడా వెనక్కి తగ్గడం.. ఊపిరి పీల్చుకున్నారు బీజేపీ నాయకులు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారట.
