దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ సైబర్ నేర విభాగం.. సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను త్వరగా ఫైల్ చేయడం, వాటి పరిష్కారం దిశగా తీవ్రంగా శ్రమిస్తోంది.డబ్బులు పొగొట్టుకున్న వారికి రిఫండ్, ఇతర రాష్ట్రాల నుంచి ఆపరేట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లను వెతికి పట్టుకోవడంలో చాలా వేగంగా స్పందిస్తోంది.
మున్ముందు తెలంగాణతో పాటే దేశవ్యాప్తంగా నమోదయ్యే సైబర్ నేరాలు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించేందుకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను ఏఐ(AI)తో పూర్తిగా అప్డేట్ చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద దీనిని తీర్చిదిద్దుతుండగా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో అప్డేట్ అవుతున్న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను డిసెంబర్ మొదటి వారంలో డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ ఉదయం పీఎస్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏఐ అప్డేటేషన్ గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఒక్కసారి ఏఐ టెక్నాలజీతో పోలీస్ స్టేషన్ అప్డేట్ అయ్యాక ఫిర్యాదుల స్వీకరణ, ఎఫ్ఐఆర్లు, దర్యాప్తు నివేదికలు, కేస్ డైరీలు, ఛార్జ్షీట్ల తయారీ వరకు అన్ని సేవలను ఏఐతో అనుసంధానించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ‘సేతు’ కియోస్క్ ద్వారా 10 భాషల్లో ఫిర్యాదులు స్వీకరించి, వాటిని ఏఐ ద్వారా స్థానిక భాషలోకి అనువదించి సంబంధిత అధికారులకు పంపే సదుపాయం ఉంటుంది.ట్రాఫిక్ రద్దీ, హాస్టళ్లు, వాణిజ్య సంస్థలు, నేరాల తీరును విశ్లేషించి బ్లూ కోల్ట్స్ గస్తీని మెరుగుపరచడానికి ఏఐని ఉపయోగిస్తారని సమాచారం.
పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో సిద్ధమైన పైలట్ ప్రాజెక్టు ఫలితాలను సమీక్షించిన తర్వాత రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లకూ ఏఐ టెక్నాలజీని విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీంతో పౌరులకు సత్వర సేవలు అందుతాయని అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర పోలీసు యంత్రాంగం భావిస్తున్నట్టు తెలిసింది. కాగా, గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో మరల సైబర్ నేరాలు పెరుగుతుండగా.. వాటిని కట్టడి చేసేందుకు సైబర్ నేర విభాగం ఏఐ సాయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
