తెలంగాణ

BRS : రూ.5 వేల కోట్ల భూముల వేలం.. హెచ్ఎండీఏ ఆఫీసు ముట్టడించిన బీఆర్ఎస్

రాష్ట్రంలో భూముల వేలానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిన విషయం తెలిసిందే. ఈనెల 27న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను వేలం వేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

రాష్ట్రంలో భూముల వేలానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిన విషయం తెలిసిందే. ఈనెల 27న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను వేలం వేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.హైదరాబాద్‌లో పరిధిలో ఖాళీ జాగా కనిపిస్తే అమ్మేస్తున్నారని, అలా చేయడం సరికాదని వాదిస్తోంది. ఉన్న భూములు అన్ని అమ్ముకుంటూ పోతే రేపటి రోజున గ్రేటర్ పరిధిలో భూమి మిగలదని హెచ్చరించింది.

అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో రూ.5 వేల కోట్ల భూముల విక్రయానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హుడా ట్రక్ పార్క్ బాధితులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు ఐక్యంగా ఆందోళనలు చేపట్టారు.

27న హెచ్ఎండీఏ నిర్వహించనున్న ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నిరసనకు దిగారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, హుడా ట్రక్ పార్క్, మియాపూర్ భూముల వేలాన్ని నిరసిస్తూ అమీర్‌పేటలోని HMDA ప్రధాన కార్యాలయాన్ని బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. ఇప్పటికే కూకట్‌పల్లిలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన భూములను విక్రయించిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.5 వేల కోట్ల విలువైన భూములను అమ్మేందుకు సిద్ధమవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిరసన తెలుపుతున్న వారిని అడ్డుకుని నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని భూములను అమ్మడమేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన? అంటూ బీఆర్ఎస్, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు ప్రశ్నించారు.ప్రభుత్వ ఆస్తులను అమ్మడం వల్ల రాష్ట్ర సంపద పెరగదని, ఉన్న ఆస్తులు కరిగిపోతాయని మండిపడ్డారు.కాగా, ఇదే హుడా ట్రక్ భూములు వేలం వేయొద్దని ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నా రేవంత్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ ఈ వేలానికి సిద్దం కావడం గమనార్హం.

తర్వాత చదవండి