‘జెన్ జీ’ గురించి ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. వారు తలచుకుంటే ఏదైనా చేయగలరని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వాలను నిలబెట్టలన్నా, కూల్చాలన్నా వారితోనే సాధ్యం అవుతుందని, జెన్ జీని తక్కువ అంచనా వేయొద్దని, అందుకే ప్రభుత్వాలు వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, జెన్ జీ స్వయంగా చేతులారా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కొత్త వాదనలూ వినిపిస్తున్నాయి. సోనూ శర్మ అనే లైఫ్ కోచ్.. జెన్ జీల బిహేవియర్, లైఫ్ స్టైల్ (Gen Z LifeStyle) మీద కామెంట్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
చేతుల్లో ఐఫోన్.. బికారీ లైఫ్..
జెన్ జీ చేతుల్లో రూ.లక్షలు విలువ చేసే ఐఫోన్ (iPhone) ఉంటున్నాయని, కానీ బ్యాంక్ అకౌంట్‌లో రూ.వెయ్యి కూడా ఉండటంలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇన్ స్టా గ్రామ్‌లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నా పక్కన కూర్చుని మాట్లాడేందుకు కనీసం నలుగురు ఫ్రెండ్స్ ఉండటం లేదన్నారు. గూగుల్‌లో ప్రతిప్రశ్నకూ సమాధానం దొరుకుతున్నా.. జెన్ జీకి ఏం చేయాలో క్లారిటీ ఉండటం లేదన్నారు. జెన్ జీ తరం ఏదైనా అనుకుంటే చేసే సత్తా ఉన్నప్పటికీ 5 అలవాట్లు వారి జీవితాలను నాశనం చేస్తున్నాయని స్పష్టంచేశారు.
హెచ్చులకు పోవద్దు..
మనదేశంలో యువత కేవలం షో ఆఫ్ చేయడానికే ఐఫోన్స్ కొంటున్నారని, అందుకోసం అప్పులు చేస్తూ ఈఎంఐ(EMI)లు కడుతున్నారని పేర్కొన్నారు.స్థోమత లేకున్నా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు కొంటున్నారన్నారు. 2025లో 27 శాతం ఇండియన్స్ రుణం తీసుకుని మరీ విహార యాత్రలకు వెళ్లారని చెప్పారు. విదేశాల్లో ఎండ వేడి కోసం ‘సన్ రూఫ్’ కార్లు కొంటే ఇండియాలో బిల్డప్ కోసమే కొంటున్నారని విమర్శించారు. యువత రిచ్ ఎలా అవ్వాలని ఆలోచించకుండా, రిచ్‌గా బతకడానికి అప్పులు చేస్తున్నారని కుండబద్దలు గొట్టారు.
బెట్టింగులకు బానిస..
నేటి తరం జెన్ జీ బెట్టింగ్, గాంబ్లింగ్‌కు బానిసలుగా మారుతున్నారని, పలు నివేదికల ప్రకారం ఏటా రూ.20వేల కోట్లు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. కొందరు ఆర్థిక సమస్యల కారణంగా బెట్టింగులు చేస్తుంటే మరికొందరు గుడ్డిగా డబ్బులు ఉచితంగా వస్తాయని బెట్టింగ్‌లు వేస్తున్నారని చెప్పారు. డబ్బు సంపాదిస్తున్నవారి కంటే సంపాదన లేనివారే ఎక్కవ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని, తీరా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
వెంటనే సక్సెస్ కావాలట..
జెన్ జీలు వెంటనే రిజల్ట్ కోరుకుంటున్నారని, అది మంచి అలవాటు కాదన్నారు. జీవితంలో సెటిల్ కావాలన్నా, సక్సెస్ రావాలన్నా టైం పడుతుందని, కానీ జెన్ జీకి అంత ఓపిక ఉండటం లేదన్నారు. ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో ఫుడ్, ఇతర ఐటమ్స్ వచ్చినట్టు జీవితంలో ప్రతిదీ అలానే జరగాలని కోరుకుంటున్నారని, అందుకే ఇబ్బందుల పాలవుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు.
సోషల్ మీడియా వ్యసనం..
సోషల్ మీడియాకు జెన్ జీ అడిక్ట్ అవుతోంది. అదొక వ్యసనంలా మారి యువత సమయం మొత్తాన్ని కిల్ చేస్తోంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు సోషల్ మీడియాతోనే కొందరు కాలం వృథా చేస్తున్నారని విమర్శించారు.దాంతో కెరీర్ మీద దృష్టి పెట్టడంలేదని చెప్పారు. ఒకప్పుడు ఖాళీ సమయంల దొరికితే స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేవారని, గేమ్స్ ఆడేవారని, ఇప్పుడు అవేమీ కనిపించడం లేదన్నారు.
ఓవర్ థింకింగ్, స్ట్రెస్ లైఫ్..
ఓవర్ థింకింగ్, యాంక్సైటీని జెన్ జీ అధికంగా ఫేస్ చేస్తోందని సోనూ శర్మ (లైఫ్ కోచ్) వెల్లడించారు. తక్కువ పనిచేసి ఎక్కువ ఆందోళన చెందుతున్నారని, వర్క్ స్టార్ట్ చేయకముందే ఫలితం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారని తెలిపారు. జాబ్, బిజినెస్ చేయాలన్నా ఫలితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఆందోళనకు గురవుతున్నారని.. ఫలితంగా జీవితంలో ఎలాంటి డేర్ స్టెప్ వేయడం లేదన్నారు. చివరకు డిప్రెషన్‌లోకి వెళుతున్నారని తెలిపారు. ఈ ఐదు అలవాట్లను జెన్ జీ మానుకుంటే జీవితంలో తప్పకుండా సక్సెస్ అవుతారని వెల్లడించారు.
