తెలంగాణ

Aurobindo Pharma: యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ కోటి రూపాయల విరాళం

మంచిరేవులలోని యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ మౌలిక వసతుల అభివృద్ధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. బుధవారం డీజీపీ సీవీ ఆనంద్‌కు చెక్కును అందజేసింది.

Aurobindo Pharma: మంచిరేవులలోని యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ మౌలిక వసతుల అభివృద్ధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. బుధవారం డీజీపీ సీవీ ఆనంద్‌కు చెక్కును అందజేసింది. అరబిందో ఫార్మా లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ కె. నిత్యానంద రెడ్డి తరఫున ఫౌండేషన్‌ సీఎస్‌ఆర్‌ హెడ్‌ ఎస్‌. సదానంద రెడ్డి, అరబిందో ఫార్మా లిమిటెడ్‌ కార్పొరేట్‌ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఐ.ఎస్‌.ఆర్‌. రావు ఈ చెక్కును డీజీపీకి అందించారు.

ఈ విరాళం అందించడంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, సంగారెడ్డి ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ప్రత్యేక చొరవ చూపారు. ఫౌండేషన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, విరాళం అందేలా కృషి చేశారు. పాఠశాలలో మెరుగైన విద్యా సదుపాయాల కల్పన, మౌలిక వసతుల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలను కల్పించేందుకు ఈ ఆర్థిక సాయం దోహదపడనుంది.

ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌, మహిళా భద్రతా విభాగం డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, ఏడీజీ (శాంతిభద్రతలు) అకున్‌ సబర్వాల్‌ తోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

తర్వాత చదవండి