క్రైమ్

Police Funds Scam: పోలీసు ఫండ్స్ పక్కదారి.. రూ.1.33 కోట్లు మాయం!

రాష్ట్రంలో పోలీసు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నిధులను ఇద్దరు వ్యక్తులు మాయం చేశారు. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్‌లోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (CAR) ప్రధాన కార్యాలయంలో పోలీసుల సంక్షేమ నిధుల నుంచి దాదాపు రూ.1.33 కోట్లు స్వాహా అయినట్లు అధికారులు గుర్తించారు.

రాష్ట్రంలో పోలీసు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నిధులను ఇద్దరు వ్యక్తులు మాయం చేశారు. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్‌లోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (CAR) ప్రధాన కార్యాలయంలో పోలీసుల సంక్షేమ నిధుల నుంచి దాదాపు రూ.1.33 కోట్లు స్వాహా అయినట్లు అధికారులు గుర్తించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉద్యోగులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకివెళితే.. సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (CAR) ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న బి.వినయ్ కుమార్, మొహ్సిన్ జలాల్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నిధులను పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాత చెక్ బుక్కులలో మిగిలిపోయిన చెక్కు లీవ్స్‌ను ఉపయోగించి ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు సమాచారం.

అనంతరం వాటిని ఉపయోగించి ఎవరికీ తెలియకుండా నిధులను డ్రా చేశారు. హుస్సేనీ ఆలం ఎస్‌బీఐ (SBI) శాఖలో చెక్కులను జమ చేసినట్టు విచారణలో తేలింది. మొత్తం 35 అనుమానాస్పద చెక్కులు, NEFT లావాదేవీల ద్వారా తమ వ్యక్తిగత ఖాతాలకు రూ.1.33 కోట్ల డబ్బును మళ్లించినట్టు అధికారులు గుర్తించారు.

పెట్లబుర్జ్‌లోని CAR ప్రధాన కార్యాలయంలోని రికార్డులను అంతర్గతంగా తనిఖీ చేసినప్పుడు ఈ అవకతవకలు బయటపడ్డాయి. దీంతో పరిపాలనా అధికారి ఇ.కళ్యాణి గత అక్టోబర్ 28న CCS పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన విద్యా, క్రీడలు, వితంతువుల సంక్షేమం, వినోద నిధులు, క్యాంటీన్ నీటి ఛార్జీల ఖాతాల నుండి ఈ సొమ్మును కాజేసినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు.

నిధులు పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జూనియర్ అసిస్టెంట్లు బి.వినయ్ కుమార్, మొహ్సిన్ జలాల్‌లపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద నమ్మకద్రోహం, మోసం, ఫోర్జరీ, ఖాతాల తారుమారు వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అక్టోబర్ 29న నిందితులిద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు తెలిసింది. అయితే, ఈ విషయం తెలిస్తే పోలీసు శాఖ పరువు పోతుందని ఇంతకాలం ఈ విషయాన్ని బయటకు రాకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించినట్టు సమాచారం.

తర్వాత చదవండి