తెలంగాణ

Telangana Congress : కాంగ్రెస్‌లో వీధికెక్కిన కుమ్ములాటలు.. ‘అలయ్ బలయ్’ సాక్షిగా బయటపడ్డ వర్గపోరు!

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి మధ్య కొంతకాలంగా నడుస్తున్న ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు బహిరంగ విమర్శలకు దారితీసింది.

Telangana Congress : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి మధ్య కొంతకాలంగా నడుస్తున్న ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు బహిరంగ విమర్శలకు దారితీసింది. తాజాగా బండ్రు శోభారాణి ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నియోజకవర్గంలోని వర్గపోరును బయటపెట్టింది.

వస్తామని చెప్పి హ్యాండిచ్చిన నేతలు?

ఈ ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి హాజరవుతానని ముందుగా సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తీరా కార్యక్రమం రోజున నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారు. ఎమ్మెల్యే గైర్హాజరు కావడంతో, అంతకుముందు వస్తామని హామీ ఇచ్చిన స్థానిక కాంగ్రెస్ కీలక నేతలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ వేడుకకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు భారీగా తరలివచ్చినప్పటికీ, సొంత పార్టీ నేతలు ముఖం చాటేయడంపై శోభారాణి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

కార్పొరేషన్ చైర్‌పర్సన్‌కే ప్రోటోకాల్ కరువు!

రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్‌పర్సన్ హోదాలో ఉన్నప్పటికీ, నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ మీటింగ్‌లలో తనకు కనీస ప్రోటోకాల్ దక్కడం లేదని శోభారాణి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారిక ఫ్లెక్సీలలో కూడా తన ఫోటో లేకుండా చేస్తున్నారని, ఈ విషయాన్ని అధికారులతో పాటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. 2009 నుంచి ఆలేరు టికెట్ ఆశిస్తూ, పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడినప్పటికీ, ఒక ఆడబిడ్డకు కనీస గౌరవం దక్కడం లేదనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

వేదికపైనే మోత్కుపల్లి ఫైర్.. కోటరీపై గుసగుసలు!

ఇదే ‘అలయ్ బలయ్’ వేదికపై మాట్లాడిన సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్థానిక నాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఒక ఆడబిడ్డకు కార్పొరేషన్ పదవి వస్తే కనీస ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానిస్తారా అని ఆయన ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావించడం సరికాదని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల వ్యవహార శైలి వల్లే నియోజకవర్గంలో ఇలాంటి విభేదాలు తలెత్తుతున్నాయని స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ‘అలయ్ బలయ్’ వేదికగా అసంతృప్త నేతలంతా ఒకే తాటిపైకి రావడం ఆలేరు కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో ఈ విభేదాలకు అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

తర్వాత చదవండి