Bandla Ganesh: తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే గణేశ్ నిర్మించిన ఆఖరి సినిమా. అయితే, తాజాగా బండ్ల గణేష్‌కు ఊహించని షాక్ తగిలింది.
బండ్ల గణేష్ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఓ చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఒంగోలు న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్ష విధించినట్టుగా తెలుస్తోంది. ఈ వార్త టాలీవుడ్ సినీ పరిశ్రమలో గాట్ టాపిక్‌గా మారింది. గణేష్‌కు జైలు శిక్షతో పాటుగా రూ. 95 లక్షలు జరిమానాగా కూడా విధిస్తూ కోర్టు ఈ బుధవారం తీర్పునిచ్చింది.
అసలు ఏం జరిగింది?
ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు ప్రాంతానికి చెందినటువంటి జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి బండ్ల గణేశ్ గతంలో భారీ మొత్తం చెల్లించాల్సి ఉంది. దీనికొసం బండ్ల గణేష్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన 'పరమేశ్వర ఆర్ట్స్' పేరు మీద ఓ చెక్ ఇచ్చాడు. ఆ చెక్‌ను తీసుకున్న బాధితుడు బ్యాంకులో వేయగా, ఖాతాలో తగినంత నగదు లేక బౌన్స్ అయింది. దీంతో, విషయాన్ని గణేష్‌కి తెలిపి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాడు.
ఈ విషయంలో బండ్ల గణేష్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో, మోసపోయినట్టుగా తెలుసుకున్న బాధితుడు తనకు న్యాయం చేయాలని నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో గత కొన్ని నెలలుగా ఒంగోలు కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇరువర్గాల వాదనలు నిశితంగా విన్న న్యాయమూర్తి, చెక్ బౌన్స్ అయిన మాట వాస్తవమేనని తేల్చి చెప్పారు.
ఆధారాలన్నీ నిర్మాత బండ్ల గణేశ్‌కు వ్యతిరేకంగా ఉండటంతో, కోర్టు ఆయనను దోషిగా పరిగణిస్తూ ఏడాది పాటు సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ శిక్షతో పాటుగా బాధితుడి దగ్గర తీసుకున్న అప్పు కింద రూ.95 లక్షల భారీ జరిమానాను కూడా తక్షణమే చెల్లించాల్సిందిగా, న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం, ఈ వార్త అంతటా వైరల్ అవుతోంది.
