తెలంగాణ

Ethics Committee: ఐదు నెలలైనా అతీగతీ లేదు.. ఎథిక్స్ కమిటీ మౌనంపై పొలిటికల్ హీట్!

Ethics Committee: తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ వ్యవహారశైలి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమిటీ ఏర్పాటై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా, విచారణ ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Ethics Committee: తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ వ్యవహారశైలి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమిటీ ఏర్పాటై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా, విచారణ ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై నివేదిక ఇవ్వడానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రెండోసారి పొడిగించిన గడువు కూడా ముగింపు దశకు చేరుకుంటున్నా, కమిటీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ లేకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గత అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారంటూ అధికార పక్షం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఈ వ్యవహారంపై విచారణ జరిపి మూడు నెలల్లోగా చర్యలకు సిఫారసు చేయాలని ఆదేశిస్తూ ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నియమించిన కొత్తలో వరుస సమావేశాలు నిర్వహించి, కౌశిక్ రెడ్డిపై వెంటనే వేటు పడుతుందన్నంత రేంజ్‌లో హడావిడి కనిపించింది.

అయితే ఆ తర్వాత విచారణ ప్రక్రియ పూర్తిగా నెమ్మదించిందని నివేదిక పేర్కొంది. కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, వివరణ కోసం ఆయన సమయం కోరడం, సభకు సంబంధించిన వీడియో ఫుటేజీలు కావాలని అడగడం, అందుకు కమిటీ సరేనంటూ సమావేశాలను వాయిదా వేయడం పరిపాటిగా మారింది. తొలుత ఇచ్చిన మూడు నెలల గడువులోపు వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కమిటీ గడువును స్పీకర్ మరోసారి పొడిగించారు.

మొదట్లో అంత దూకుడుగా వ్యవహరించిన ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలోని బృందం, ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అవ్వడం చర్చనీయాంశమైంది. రెండోసారి ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతున్నా నివేదిక విషయంలో అతీగతీ లేకపోవడంతో, కమిటీ ఆచితూచి అడుగులు వేస్తోందా లేక ఈ అంశాన్ని ఎటూ తేల్చలేకపోతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద ఎథిక్స్ కమిటీ మౌనంపై రాజకీయ వర్గాల్లో వేడి మొదలవగా, కౌశిక్ రెడ్డిపై చర్యలకు సిఫారసు చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

తర్వాత చదవండి