తెలంగాణ

Telangana BJP: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనను బీజేపీ అటకెక్కించేసిందా?

Telangana BJP: వచ్చే మార్చిలో జరగబోయే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తెలంగాణ బీజేపీ తీరు ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. మిగతా పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలతో దూకుడుగా ముందుకు వెళ్తుంటే.. కమలం పార్టీ మాత్రం ఎందుకు కాలయాపన చేస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది.

Telangana BJP: వచ్చే మార్చిలో జరగబోయే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తెలంగాణ బీజేపీ తీరు ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. మిగతా పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలతో దూకుడుగా ముందుకు వెళ్తుంటే.. కమలం పార్టీ మాత్రం ఎందుకు కాలయాపన చేస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. మొదట్లో అందరికంటే ముందుంటామని హడావిడి చేసిన నాయకత్వం, ఇప్పుడు సడన్‌గా సైలెంట్ అవ్వడంతో అసలు అభ్యర్థుల ప్రకటనను అటకెక్కించేశారా అనే సందేహాలు కాషాయ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల ప్రక్రియ మొదలైన కొత్తలో బీజేపీ పెద్దలు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ముహూర్తాలు కూడా చెప్పారు. అభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేక కమిటీలు వేయగా, ఆ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్ర అధ్యక్షుడికి రిపోర్టులు కూడా ఇచ్చేశాయి. ఆ తర్వాత ముఖ్య నేతల సమావేశం జరిపి, ప్రాబబుల్స్ లిస్ట్‌ను ఢిల్లీ అధిష్ఠానానికి పంపినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత మ్యాటర్ అక్కడే ఆగిపోయింది. దసరా వెళ్లింది, దీపావళి కూడా ముగిసింది.. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఘట్టం పూర్తయినా బీజేపీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఇంకా అతీగతీ లేకుండా పోయింది.

ఇంతకీ మొదట్లో అంత హడావిడి చేసిన కమలనాథులు ఇప్పుడు వెనక్కి తగ్గడానికి అసలు కారణం ఏంటనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల స్థానం అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే అసలు సమస్య అని తెలుస్తోంది. అక్కడ పార్టీ టికెట్ ఆశిస్తున్న లోకల్ లీడర్లకు గెలిచేంత బలం లేకపోవడం, అలాగని బయటి నుంచి అభ్యర్థులను ఇంపోర్ట్ చేసుకుందామంటే స్థానిక నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో అధిష్ఠానం తలలు పట్టుకుంటోందట. దీనికి తోడు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పనుల్లో బిజీగా ఉండటం కూడా ఎంపిక ప్రక్రియ ఆలస్యానికి మరో కారణమని వినిపిస్తోంది.

డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకటించే లోపే అభ్యర్థులను ఫైనల్ చేస్తే, జాబితా రాగానే ఓటర్లను నేరుగా కలిసే అవకాశం ఉంటుందని కాషాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముందే వెళ్లి కలిస్తే ఓటర్లపై ఆ ప్రభావం ఉంటుందని, అలా కాకుండా ఇంతే స్లోగా వ్యవహరిస్తే ఎన్నికల ఫలితం కూడా అలాగే ఉంటుందని నేతలు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు "బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి?" అంటూ సొంత పార్టీ శ్రేణులే నాయకత్వంపై సెటైర్లు వేసుకుంటుంటే, మరికొందరేమో మా వాళ్లు లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా ప్రకటిస్తారని సర్దిచెప్పుకుంటున్నారు. మరి కాషాయ దళం ఈ లేట్‌ని ఎలా కవర్ చేసుకుంటుందో చూడాలి.

తర్వాత చదవండి