Palnadu Water Grid: నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పల్నాడు వాటర్ గ్రిడ్ అంశం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తోందని, కృష్ణా జలాలను తరలించుకుపోతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతోనే ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందని బీఆర్ఎస్ మండిపడింది. బీఆర్ఎస్ ఆరోపణలపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు రేవంత్. అంతేకాదు.. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అని ఆయన ఎదురుదాడికి దిగారు.
ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని రేవంత్ తేల్చి చెప్పారు. తెలంగాణ నీటి హక్కులకు సమాధి కట్టింది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. అన్ని ఆధారాలతో ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడతామని స్పష్టం చేశారు.
ఏపీ మాజీ సీఎం జగన్ హయాంలో 2022లో పల్నాడు వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన జీవో విడుదలైందని రేవంత్ గుర్తుచేశారు. రూ.1,200 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని జగన్ హయాంలోనే నిర్ణయించారని చెప్పారు. అప్పుడు తెలంగాణ సీఎంగా కేసీఆరే ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో ఆనాడు కేసీఆర్ ఎందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.

తాగునీటి పనులకు పరిపాలనా అనుమతులు
కాగా.. పల్నాడు వాటర్ గ్రిడ్‌కు 2022లోనే అనుమతులు వచ్చాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని సోషల్ మీడియాలో కొందరు వివరణ ఇస్తున్నారు. 2022 ఫిబ్రవరి 16న జారీ చేసిన G.O.Rt.No.56 రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పనులకు ఇచ్చిన పరిపాలనా అనుమతులకు సంబంధించినదే తప్ప నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదనకు సంబంధించినది కాదని పేర్కొంటున్నారు.

సాగర్ నుంచి నీటిని తరలిస్తామని ప్రస్తావించలేదు
ఆ జీవోలో నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదని స్పష్టం చేస్తున్నారు. అయితే తాజాగా జారీ చేసిన జీవోలో మాత్రం నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదనను స్పష్టంగా పొందుపరిచారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, తాజా జీవోలో పాత జీవో ప్రస్తావన కూడా లేదని చెబుతున్నారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ప్రభుత్వంపై దుష్ప్రచారం
APRA నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వానికి, కేఆర్‌ఎంబీకి సమాచారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపట్టడం విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని విమర్శిస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త ప్రతిపాదన అని, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి గత కేసీఆర్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు.
