తెలంగాణ

RS Praveen: రేవంత్ రెడ్డి హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలి- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen: హైదరాబాద్ లో ఎన్నడూ లేనంత హింస జరుగుతోందని.. నగర ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాపోయారు. ముర్తుజా పహిల్వాన్ ను రాత్రి ఇకో పార్క్ వద్ద దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని చెప్పారు.

* టెర్రర్ అటాక్ మెయిల్ లీకేజీపై విచారణ జరపాలి

* బీఆర్ఎస్ నాయకులపై ఫేక్ కేసులు పెట్టడంపైనే పోలీసుల దృష్టి

* రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నంత కాలం ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదు

RS Praveen: హైదరాబాద్ లో ఎన్నడూ లేనంత హింస జరుగుతోందని.. నగర ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాపోయారు. ముర్తుజా పహిల్వాన్ ను రాత్రి ఇకో పార్క్ వద్ద దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని చెప్పారు. గత నెలలో మల్కాజిగిరి కమిషనరేట్ లో ఖమ్మం రౌడీ గ్యాంగ్ లు ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో రౌడీ షీటర్ ను నరికి చంపారని గుర్తు చేశారు. ఇటీవల పాలు అమ్ముకునే వ్యక్తి మీద కూడా జరిగిందన్నారు. హైదరాబాద్ నగరానికి సిలికాన్ వ్యాలీ అనే పేరు ఉందని.. డల్లాస్ తో పోటీ పడుతోందని.. అలాంటి హైదరాబాద్ ఇప్పుడు గ్యాంగ్ వార్ కు అడ్డాగా మారిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

రేవంత్ వచ్చాక పోలీస్ శాఖ పతనం

కేటీఆర్ పట్టణ, ఐటీ, పరిశ్రమల మంత్రిగా ఉన్నపుడు హైదరాబాద్ వర్థిల్లిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టారని, విజిబుల్ పోలిసింగ్ జరిగేదన్నారు. పోలీసులు రోడ్ల మీద ఉండేవారు, అనుమానిత వాహనాలను తనిఖీ చేసేవారు.. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టారు.. సైబర్ సెక్యూరిటీ ఫోర్స్ బలోపేతం చేశారు.. సైబర్ పోలీస్ స్టేషన్స్ పెంచారు అని ప్రవీణ్ కుమార్ చెప్పారు. అయితే, రేవంత్ రెడ్డి వచ్చాక తెలంగాణలో పోలీసు శాఖ పతనమైందని మండిపడ్డారు.

మెటాపై దాడి చేయడం దారుణం

మెటా అనే కంపెనీ ఆఫీసుల మీద పట్టపగలే యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేసి... మేమే చేశామంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రపంచ కంపెనీలను తెస్తున్నామని నమ్మబలుకుతూ.. మల్టీ నేషనల్ కంపెనీల మీద దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కూడా యూత్ కాంగ్రెస్ ను వెనకేసుకురావడం దారుణం అన్నారు. నాకు కూడా భయమేస్తోంది, కానీ ప్రజల సంక్షేమం కోసం చెప్పాలి.. రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలి అని ప్రవీణ్ కుమార్ అన్నారు.

''జాయింట్ కమిషనర్ స్పెషల్ బ్రాంచ్ నుండి ఒక లేఖ విడుదలైంది. అది కేవలం ఇన్స్ పెక్టర్లు, ఏసీపీ, డీసీపీలకు వెళ్తుంది. అలర్ట్ ఆన్ టెర్రర్ టు రిపీట్ 26/11 ముంబయి టెర్రర్ అటాక్స్ ఇన్ హైదరాబాద్ పేరిట నవంబర్ 21న లేఖ వచ్చింది. లష్కరే తోయిబా నాయకుడు లతీఫ్ భట్ ను ఇండియన్ ఆర్మీ చంపినందుకు ప్రతీకారంగా దాడులకు పాల్పడుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇది అంతర్గతంగా ఉండాల్సిన విషయం.

మెయిల్ వచ్చినపుడే ఎందుకు వెరిఫై చేయలేదు?

హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ రైల్వే స్టేషన్, జనసమూహం ఉన్న చోట 300 మందిని చంపుతామని లష్కరే తోయిబా నుండి మెయిల్ వచ్చినట్టు ఈ లేఖలో చెప్పారు. సీఐ, ఏసీపీ, డీసీపీల వద్ద ఉండాల్సిన మెసేజ్ సోషల్ మీడియాలో వచ్చింది. తర్వాత అవి పుకార్లు నమ్మొద్దని పోలీసు అధికారులు చెప్పారు. ఆ లేఖ ఒరిజినలా? ఫేకా? అని డీజీపీ వెరిఫై చేస్తున్నారు. మెయిల్ వచ్చినపుడే ఎందుకు వెరిఫై చేయలేదు?

మెయిల్ ఎలా లీక్ అయింది? సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది?

లుంబినీ పార్క్ అటాక్ లో మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేశాం. తర్వాత కూడా చాలా చోట్ల అటాక్ జరిగింది. ప్రతిసారీ ఉగ్రవాదులు ఇలా మెయిల్స్ పంపరు. పంపకుండా అటాక్ చేస్తారు. మెయిల్ ఎలా లీక్ అయింది? సామాజిక మాధ్యమాల్లోకి ఎలా వచ్చింది? ముంబై తరహా దాడులు జరుగుతాయని మెయిల్ వస్తే.. అంతర్గతంగా వెరిఫై చేయకుండా ఎందుకు బయటకు వచ్చింది? ఇది కోటి మంది ప్రజల సమస్య.. దీనిపై విచారణ జరపాలి. దీనిపై ఇంత వరకు ముఖ్యమంత్రి స్పందించడం లేదు. మౌనమే ఆయన సమాధానంగా ఉంది. అవసరమైనపుడు కోట్లు పెట్టి మీటింగ్స్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తిడుతున్నారు.

సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది?

సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది? గతంలో జర్నలిస్టుల మీద ఉపా కేసు పెట్టమన్నారని కౌంటర్ ఇంటలిజెన్స్ ఎస్పీ పేరుతో సహా సమాచారం లీక్ అయింది. ఫోన్ ట్యాపింగ్ చట్ట ప్రకారమే జరుగుతుంది. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇరికించాలని చూశారు. సినిమా తారల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని లీక్ చేసి తర్వాత తప్పించుకుంటున్నారు. అసలు పోలీస్ శాఖలో ఉండే కొన్ని డిపార్ట్ మెంట్స్ ఎవరికీ తెలియదు. పోలీసులకు కూడా చాలామందికి తెలియదు. కానీ ఫోన్ ట్యాపింగ్ సమాచారం మార్కెట్ లో అమ్ముతున్నారు.

కేసీఆర్ హయాంలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు

కేసీఆర్ హయాంలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు. ఆక్టోపస్, ఇంటర్ సెప్టర్ వెహికిల్స్, కమాండోలను పెట్టి... ఉగ్రవాదులు రావాలంటే కూడా భయపడేలా చేశారు. నిరంతరం అనుమానిత వాహనాలను తనిఖీ చేసేవారు. ఇపుడు అలాంటిది ఏదీ లేదు. కేవలం శుక్రవారం రాత్రి 8 గంటలకు పబ్ ల ముందు బ్రీత్ అనలైజర్ పట్టుకొని నిలబడుతున్నారు. పోలీసులే పబ్ ఓనర్లతో మిలాఖత్ అవుతున్నారు. ఎంపీ సోదరుడు పీకల దాకా తాగి కొట్టుకుంటే.. పోలీసులు నేరస్తులను వేడుకుంటున్నారు.

మెటా మీద దాడి సిగ్గుచేటు.

మెటా మీద దాడి సిగ్గుచేటు. అది ట్రిలియన్ డాలర్ల కంపెనీ. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా నడుపుతున్న కంపెనీ. మెటా కంపెనీపై దాడి చేసిన దుండగులను కేవలం 3 గంటలు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పెట్టి వదిలేశారు. గతంలో కేటీఆర్ గురించి అశ్లీల థంబ్ నైల్స్ పెట్టినందుకు బీఆర్ఎస్వీ కార్యకర్తలు ఒక టీవీ ఛానల్ పై దాడి చేస్తే 16 రోజులు జైల్లో పెట్టారు. రైతుల గురించి మాట్లాడితే నల్ల బాలును 16 రోజులు జైల్లో ఉంచారు. ఇలానే మెటా కంపెనీపై దాడి చేసిన నిందితులనూ జైల్లో వేయండి.

బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం మీదనే దృష్టి

సంధ్యారావు ఫేక్ అకౌంట్ ను పరిచయం చేసిన మహా వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇకో పార్క్ వద్ద మర్డర్ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కార్పొరేట్ హోటల్స్, ఆఫీసులకు వెళ్తే సెక్యూరిటీ కూడా వాహనాలు తనిఖీ చేస్తారు. సెక్యూరిటీ గార్డుల కంటే ఘోరమా పోలీసులు? పోలీసుల దృష్టి అంతా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం మీదనే ఉంది.

ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదు

కేటీఆర్ ప్రపంచ దేశాల నుండి కంపెనీలు తెస్తే.. యూత్ కాంగ్రెస్ నాయకులేమో కంపెనీలపై దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి హోం మంత్రిగా రాజీనామా చేయాలి. మెయిల్ కు సంబంధించి లీక్ చేసి పోలీస్ అధికారులకు పంపినందుకు రాజీనామా చేయాలి. మాక్ డ్రిల్ చేసి, వాహనాలు ఇచ్చి, పోలీసులను రోడ్ల మీద పెట్టి నిరంతరం ప్రజలను గతంలో కేసీఆర్ కాపాడారు. ఇపుడు అలా లేదు. రేవంత్ రెడ్డి హోం మంత్రిగా ఉన్నంత కాలం ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదు'' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు.

తర్వాత చదవండి