తెలంగాణ

Seethakka: కవిత గురించి కావాలని అన్న మాట కాదు- మంత్రి సీతక్క విచారం

Seethakka: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం పట్ల మంత్రి సీతక్క స్పందించారు. పొరపాటు జరిగిందని విచారం వ్యక్తం చేశారు.

* క‌ల్వ‌కుంట్ల కవిత వ్యాఖ్యలను ప్రస్తావించే క్రమంలో పొరపాటు జరిగింది.. చింతిస్తున్నా

* కవితను ఉద్దేశించి ఆ పదం అనలేదు.. మాటల్లో దొర్లింది

* వెంటనే వెనక్కి తీసుకున్నా.. బీఆర్ఎస్ వైరల్ చేయడం దుర్మార్గం

* ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొంటా.. వ్యక్తిగత విమర్శలు నా నైజం కాదు

* కేటీఆర్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన అక్కసుతోనే దుష్ప్రచారం

* మంత్రి సీతక్క వివరణ.. కవిత వ్యాఖ్యల ప్రస్తావనలో పొరపాటు జరిగిందని వెల్లడి

Seethakka: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం పట్ల మంత్రి సీతక్క స్పందించారు. పొరపాటు జరిగిందని విచారం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను ప్రస్తావించే క్రమంలో తన నోటి నుంచి పొరపాటున పదం దొర్లిందని, అందుకు చింతిస్తున్నానని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని సీతక్క తీవ్రంగా ఖండించారు.

కావాలని అనలేదు.. అనుకోకుండా దొర్లిన పదం

ములుగులో చేయూత నూతన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఫైలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ బాధితులకు పెన్షన్లు మంజూరు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో.. కవిత ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించే క్రమంలో పొరపాటు జరిగిందని సీతక్క వివరించారు. ఉద్దేశపూర్వకంగా కవితను ఆ మాట అనలేదని, అది అనుకోకుండా దొర్లిన పదమని, వెంటనే సరిదిద్దుకుని వెనక్కి తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ రాజకీయ కక్షతో బీఆర్ఎస్ నేతలు తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ట్రోల్ చేయడం దుర్మార్గమని మంత్రి సీతక్క మండిపడ్డారు.

క్యాన్సర్ కు బదులుగా పొరపాటున ఆ పదం వాడా

రాజకీయ కక్షతో బీఆర్ఎస్ తనను క్యాన్సర్ పేషెంట్‌గా చిత్రీకరించిందని.. కవిత స్వయంగా ఓ మీడియా ఛానెల్‌కు చెప్పిన విషయాన్నే తాను ప్రస్తావించానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అయితే ఇందులో క్యాన్సర్ కు బదులుగా తాను ఎయిడ్స్ అన్న పదాన్ని పొరబాటున వాడినట్లు తెలిపారు.

వ్యక్తిగత విమర్శలు నా నైజం కాదు

వరంగల్ పర్యటన సందర్భంగా చేయూత పెన్షన్లపై కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారాన్ని తాను తిప్పికొట్టాననే అక్కసుతోనే తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా, సిద్ధాంతపరంగానే ఎదుర్కొంటానని.. వ్యక్తిగత విమర్శలు చేయడం తన నైజం కాదని సీతక్క తేల్చి చెప్పారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసని అన్నారు. కవిత గురించి మాట్లాడే క్రమంలో పొరపాటు జరిగింది.. చింతిస్తున్నా అని చెప్పడం ద్వారా వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు మంత్రి సీతక్క.

తర్వాత చదవండి