Cm Revanth: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్స్ మరో సాక్ష్యంగా నిలిచాయి. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన అక్రమ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం ఏపీకి వరంగా మారితే.. తెలంగాణకు శాపంగా పరిణమిస్తోంది.
చంద్రబాబు అడుగులకు మడుగులు.. తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు
చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తురనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదు. నాగార్జునసాగర్ జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి రేవంత్ ఎందుకు ప్రశ్నించలేదు? ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు గళమెత్తలేదు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
మరోసారి రేవంత్ జలద్రోహం
నాడు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహం చేశారు. నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కృష్ణా జలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించకుండా మరోసారి జలద్రోహానికి పాల్పడ్డారని సీఎం రేవంత్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి.
నాడు బనకచర్ల.. నేడు పల్నాడు!
ప్రాజెక్టులు మారుతున్నాయి.. వేదికలు మారుతున్నాయి.. కానీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి వైఖరి మాత్రం మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఎవరు? మేధావులు, తెలంగాణవాదులు ఆలోచించాలన్న విజ్ఞప్తి వస్తోంది. కేఆర్ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని ఏపీ ఇంజనీర్లే చెబుతుంటే.. సమావేశంలో పల్నాడు ప్రాజెక్టుపై చర్చించామని గొప్పగా ప్రచారం చేసుకున్న వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? అని తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తోంది.
''నాడైనా, నేడైనా నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది, చేస్తున్నది కాంగ్రెసే. రేవంత్ రెడ్డి.. నీ అసలు రంగు బయటపడింది. నీ నిజస్వరూపం బట్టబయలైంది. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి నువ్వు చేస్తున్నది చారిత్రక ద్రోహం. ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదు'' అని తెలంగాణ పౌర సమాజం మండిపడుతోంది.
