Winter Health: చలికాలం మొదలైందంటే చాలు.. ఉదయం లేవాలంటే బద్ధకం, రోజంతా ఏదో తెలియని నీరసం, ఒళ్లు నొప్పులు, మూడ్ ఆఫ్ అవ్వడం లాంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. సాధారణంగా చలికి ఇలాగే ఉంటుందని అంతా లైట్ తీసుకుంటారు. కానీ, దీని వెనుక ఓ పెద్ద కారణం దాగి ఉంది. చలికాలంలో మన శరీరంలో విటమిన్-డి స్థాయిలు ఒక్కసారిగా పడిపోవడమే ఈ సమస్యలన్నింటికీ అసలు మూలం. ఎముకలు గట్టిగా ఉండటానికీ, తిన్న ఆహారంలోని కాల్షియం ఒంటికి పట్టడానికీ, రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గకుండా ఉండటానికీ విటమిన్-డి చాలా కీలకం. మరి ఒక్క చలికాలంలోనే ఈ విటమిన్ ఎందుకు తగ్గిపోతుంది? దాన్ని ఎలా కవర్ చేయాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
చలికాలంలో విటమిన్-డి పడిపోవడానికి 3 ముఖ్య కారణాలు..
ఎండ తీవ్రత తగ్గిపోవడం
మన శరీరానికి విటమిన్-డి దొరికే అతిపెద్ద, సహజమైన మార్గం సూర్యరశ్మి. కానీ చలికాలంలో పగటిపూట ఎండ చాలా తక్కువగా ఉంటుంది. ఉదయం పూట మంచు, ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడం వల్ల మన చర్మానికి అందాల్సిన ముఖ్యమైన యూవీబీ కిరణాలు సరిగ్గా తగలవు.
స్వెటర్లు, జాకెట్లతో ఒళ్లంతా కప్పేయడం
చలిగాలుల నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఇళ్లు, ఆఫీసులకే పరిమితమవుతున్నారు. ఒకవేళ బయటకు వచ్చినా స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లతో చేతులు, కాళ్లు, ముఖం సహా శరీరంలో ఏ ఒక్క భాగం బయటకు కనిపించకుండా కప్పేసుకుంటున్నారు. చర్మానికి నేరుగా ఎండ తగలకపోవడంతో శరీరంలో విటమిన్-డి తయారీ పూర్తిగా ఆగిపోతోంది.
వేడివేడి చిరుతిళ్లపైనే మనసు
చలికాలంలో వేడివేడిగా, నోటికి రుచిగా ఉండే ఆహారాల వైపే అందరూ మొగ్గు చూపుతారు కానీ, విటమిన్-డి ఉండే పోషకాహారాన్ని పట్టించుకోరు. దీనికి తోడు చలికి వ్యాయామం తగ్గించడం, వయసు పెరగడం, చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం కూడా విటమిన్-డి లోపానికి కారణమవుతున్నాయి.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే ..
ఉదయం లేదా మధ్యాహ్నం ఎండ మరీ చురుక్కుమనకుండా ఉన్న సమయంలో కనీసం 15–20 నిమిషాల పాటు చేతులు, కాళ్లకు నేరుగా ఎండ తగిలేలా చూసుకోండి. అలాగే ఆహారం ద్వారా విటమిన్-డి అందాలంటే చేపలు, గుడ్డు పచ్చసొన, మష్రూమ్స్, విటమిన్-డి కలిపిన పాలు, తృణధాన్యాలను రోజువారీ డైట్లో భాగం చేసుకోవాలి. ఒకవేళ నీరసం, కీళ్ల నొప్పులు, అలసట మరీ ఎక్కువగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను కలవాలి.
