Vrushakarma Trailer: అక్కినేని హీరో నాగ చైతన్య తండేల్ లాంటి భారీ హిట్ తర్వాత ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త ప్రయత్నంతో మన ముందుకు రాబోతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వృషకర్మ’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. గత చిత్రం ‘విరూపాక్ష’తో మిస్టరీ, థ్రిల్లర్ జానర్‌లో తనదైన ముద్ర వేసి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు కార్తీక్ వర్మ దండు.
ఇక, ఈసారి మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు చైతూ. అయితే, ఇప్పటికే వృష కర్మ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పాటలు అందరిలోనూ విపరీతంగా ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ వదిలారు.
ఈ ట్రైలర్ ఇప్పుడున్న అంచనాలను మరింతగా పెంచేలా అనిపిస్తోంది. నాగ చైతన్యను ఇంతకుముందెన్నడూ చూడని కొత్త అవతార్‌లో చూపించడం, కథలోని మిస్టరీని ఎంతో ఆసక్తికరంగా పరిచయం చేయడం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మిస్టరీ, పురాణ నేపథ్యం, అడ్వెంచర్.. ఈ మూడు అంశాలను అద్భుతంగా కలిపి ‘వృషకర్మ’ కథను దర్శకుడు తెరకెక్కించినట్టుగా తాజా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. కమర్షియల్ కథలకు పూర్తి భిన్నంగా.. ఒక రహస్య ప్రపంచం, దాని వెనుక ఉన్న శక్తులు, వాటి ప్రభావం మనుషుల మీద ఎలా ఉంటుందనే అంశాలను చాలా ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కార్తీక్.
ఈ సినిమాలో నాగ చైతన్య లుక్, తన బాడీ లాంగ్వేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ట్రెజర్ హంటింగ్, మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ కథలో చైతూ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా, ఇంతవరకు చైతూ చేసిన సినిమాలతో పోలిస్తే ఈ వృష కర్మ పూర్తి భిన్నమైన జానర్‌లో ఉండటం విశేషంగా చెప్పాలి. ఈ సినిమాలో చైతూకి జంటగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.
