Electric Blanket Risks: చలికాలం వచ్చిందంటే చాలు.. వణుకు పుట్టించే చలి నుంచి తప్పించుకోవడానికి రగ్గులు, రూమ్ హీటర్లతో పాటు ఈ మధ్య 'ఎలక్ట్రిక్ బ్లాంకెట్లు' కూడా బాగా వాడుతున్నారు. ప్లగ్ పెడితే చాలు.. లోపల ఉండే హీటింగ్ వైర్ల వల్ల దుప్పటి నిమిషాల్లో వెచ్చగా మారిపోతుంది. మంచం మీద పరుచుకునేవి, ఒంటిపై కప్పుకునేవి ఇలా రకరకాల మోడళ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే, ఇవి ఎంత వెచ్చదనాన్ని ఇస్తాయో.. వాడకంలో చిన్న అజాగ్రత్త జరిగినా అంతే పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ దుప్పటి వాడేటప్పుడు ఈ 5 పొరపాట్లు చేస్తే కరెంట్ షాక్ కొట్టడం, చర్మం కాలిపోవడం లేదా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు అంటుకోవడం ఖాయం అని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఐదు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రంతా ఆన్ చేసి నిద్రపోవడం
చాలామంది చలికి తట్టుకోలేక దుప్పటి స్విచ్ ఆన్ చేసే ఉంచి నిద్రపోతుంటారు. కానీ దానికి టైమర్ లేదా ఆటోమేటిక్ షట్‌డౌన్ లాంటి సేఫ్టీ ఫీచర్లు లేకపోతే ఇది చాలా డేంజర్. పడుకునే ముందు కాసేపు ఆన్ చేసి మంచాన్ని వెచ్చగా చేసుకుని, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసి నిద్రపోవడం సేఫ్. కంపెనీ రూల్స్‌లో ఫర్మిషన్ ఉంటే తప్ప రాత్రంతా ఆన్ చేసి ఉంచకండి.
మడతపెట్టి, ముద్దగా చేసి వాడటం
సాధారణ రగ్గుల్లాగే ఎలక్ట్రిక్ బ్లాంకెట్లను మడతపెట్టి లేదా నలిపి ముద్దగా చేసి వాడకూడదు. అలా చేస్తే లోపల ఉండే సన్నటి హీటింగ్ వైర్లు ఒత్తిడికి గురై, కొన్ని చోట్ల విపరీతంగా వేడెక్కుతాయి. దీనివల్ల వైర్లు కరిగిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడూ మంచం మీద సాఫీగా పరిచి మాత్రమే వాడాలి.
తడిగా ఉన్నప్పుడు ప్లగ్ పెట్టడం
దుప్పటి మీద పొరపాటున నీళ్లు, టీ ఒలికినా లేదా తేమ తగిలినా అస్సలు స్విచ్ ఆన్ చేయకండి. నీరు, కరెంట్ కలిస్తే వెంటనే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ తడిస్తే వెంటనే ప్లగ్ తీసేసి, పూర్తిగా ఆరిన తర్వాత కంపెనీ సూచనల ప్రకారమే మళ్లీ వాడాలి.
పాతవి, వైర్లు లూజ్ అయినవి వాడటం
మీ ఎలక్ట్రిక్ దుప్పటి మరీ పాతదైపోయినా, వైర్లు వదులుగా కనిపించినా, టెంపరేచర్ కంట్రోల్ స్విచ్ సరిగ్గా పనిచేయకపోయినా వెంటనే వాడటం ఆపేయండి. పాడైన వైరింగ్ వల్ల మంచం మీదే మంటలు అంటుకునే ప్రమాదం ఉంది.
దుప్పటిపై బరువులు లేదా హాట్ వాటర్ బ్యాగ్ పెట్టడం
ఎలక్ట్రిక్ బ్లాంకెట్ వాడుతున్నప్పుడు దాని మీద మందపాటి రగ్గులు, దిండ్లు, పుస్తకాల్లాంటి బరువైన వస్తువులు వేయకండి. అలాగే దాంతో పాటు వేడినీళ్ల బ్యాగ్ లేదా హీటింగ్ ప్యాడ్ అస్సలు పెట్టకండి. ఇలా చేస్తే వేడి బయటకు పోయే దారి లేక ఒకే చోట పేరుకుపోయి వైర్లు డ్యామేజ్ అవ్వడమే కాకుండా ఒళ్లు కాలిపోయే ఛాన్స్ ఉంది.
పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్త
చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే వేడిని త్వరగా గుర్తించలేని వారికి వీటిని ఒంటరిగా వదిలేయకండి. దుప్పటి మరీ వేడెక్కితే వాళ్లు సమయానికి ఆపలేకపోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా ఎలక్ట్రిక్ దుప్పటి కొనాలనుకుంటే తక్కువ ధరకు వస్తుందని నాసిరకంవి కాకుండా.. టెంపరేచర్ కంట్రోల్, ఓవర్ హీట్ ప్రొటెక్షన్, ఆటో-ఆఫ్ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్న మంచి బ్రాండ్ మోడల్‌నే తీసుకోండి.
