తెలంగాణ

Gaddam Vamsi Krishna: పెద్దపల్లి కాంగ్రెస్‌లో శిలాఫలకం చిచ్చు! సీఎస్‌కు ఎంపీ వంశీ లేఖాస్త్రం

పెద్దపల్లిలో కాంగ్రెస్ లో మళ్లీ వివాదం రాజుకుంది. మంత్రి శ్రీధర్ బాబు టార్గెట్ గా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు లేఖ రాశారు.

Gaddam Vamsi Krishna: పెద్దపల్లిలో కాంగ్రెస్ లో మళ్లీ వివాదం రాజుకుంది. మంత్రి శ్రీధర్ బాబు టార్గెట్ గా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు లేఖ రాశారు. మంథని నియోజకవర్గంలో ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవనాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అయితే, భవనం శిలాఫలకంపై సీఎం రేవంత్, మంత్రుల పేర్లు, ఫోటోలు లేకపోవడంపై ఎంపీ వంశీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ముఖ్యమంత్రిని, మంత్రులను అగౌరవపరచడమే అని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన వంశీకృష్ణ.. 24 గంటల్లో కొత్త శిలాఫలకం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాధనం, ప్రభుత్వ సంస్థ.. ఘనత మాత్రం ఒక్కరికే!

ప్రభుత్వ కార్యక్రమాల ఘనతను ఒక్కరికే ఆపాదించడం సరికాదన్నారు ఎంపీ వంశీ. ప్రోటోకాల్ ఉల్లంఘనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను కోరారు. ప్రజాధనం, ప్రభుత్వ సంస్థ.. ఘనత మాత్రం ఒక్కరికే అంటూ లేఖలో రాసిన ఎంపీ వంశీ కృష్ణ వెంటనే శిలాఫలకాన్ని సరిదిద్దాలన్నారు. 24 గంటల్లో శిలాఫలకం మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. భవనం శిలాఫలకంపై సీఎం పేరు, ఫోటో.. ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత శాఖ మంత్రుల పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి పేరును విస్మరించడం విచారకరం

''రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ పేరును విస్మరించడం అంటే చిన్న విషయం కాదు. రాష్ట్రంలో అత్యున్నత ప్రజాస్వామ్య కార్యనిర్వాహక పదవి గౌరవానికి భంగం కలిగించడమే. ఇది వ్యక్తిగత గుర్తింపునకు సంబంధించిన విషయం కాదు. ప్రభుత్వ వ్యవస్థల గౌరవానికి, పరిపాలన క్రమశిక్షణకు సంబంధించిన అంశం. ప్రోటోకాల్ ప్రకారం భవనం శిలాఫలకంపై సీఎం, సంబంధిత శాఖ మంత్రులు, అర్హులైన ఇతర ప్రజాప్రతినిధుల పేర్లను చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలి. ఈ ఘటనపై పరిపాలన విచారణ జరిపించాలి. అలాగే అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ కార్యక్రమాలు వ్యక్తిగత ప్రచారానికి వేదికలు కాకూడదు

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం నిర్వహించేవి. అవి వ్యక్తిగత ప్రచారానికి వేదికలు కాకూడదు. ప్రభుత్వ ప్రోటోకాల్‌ను పాటించడం, రాజ్యాంగబద్ధ పదవులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల కంటే వ్యవస్థలు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నా గళాన్ని ఎల్లప్పుడూ వినిపిస్తాను'' అని సీఎస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు ఎంపీ వంశీ కృష్ణ.

శిలాఫలకంలో సీఎం ఫోటో, పేరు పెట్టండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ సీఎస్ కు ఎంపీ వంశీ రాసిన లేఖతో రాజకీయ దుమారం రేగింది. మంత్రి శ్రీధర్ బాబు టార్గెట్ గా ఎంపీ వంశీ సంధించిన లేఖాస్త్రం కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది.

తర్వాత చదవండి