TG: హైదరాబాద్ ఐటీ కారిడార్లో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు గట్టి ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు. సైబరాబాద్ పరిధిలో వాహనాల రద్దీని తగ్గించేందుకు త్వరలోనే ‘వన్ వే’ విధానంతో పాటు సిటీ బస్సుల కోసం ప్రత్యేకంగా ‘బస్ లైన్లు’ ఏర్పాటు చేయబోతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త మార్పులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలంటే ప్రజలు, వాహనదారులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సొంత వాహనాల వల్లే అసలు సమస్య
సైబరాబాద్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో సీఎంసీ, సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సైబరాబాద్ మూవ్స్ - 2026’ సదస్సును డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఎందుకు పెరుగుతోందో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన 20 ఏళ్లలో సైబరాబాద్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ఇక్కడ దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. అయితే, వీరిలో సుమారు 80 శాతం మంది సొంత వాహనాల్లోనే ఆఫీసులకు రావడానికి మొగ్గు చూపుతుండటంతో రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని అన్నారు.
సైబరాబాద్ పోలీసులు, సీఎంసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదని, ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ సదస్సు ఇందుకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపుతుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ఉత్తమ విధానాలను ఆయన అతిథులతో కలిసి పరిశీలించారు. అలాగే, రద్దీ నియంత్రణ కోసం ప్రధాన జంక్షన్లు అభివృద్ధి చేసేందుకు సైబరాబాద్ పోలీస్, సెక్యూరిటీ కౌన్సిల్, ‘లివింగ్ ల్యాబ్’ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సదస్సుకు లండన్ ట్రాన్స్పోర్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశివర్మ, బొగోటా మేయర్ ఎన్రీకి పెనలోజా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సైబరాబాద్ సీపీ రమేష్తో పాటు పలు ఐటీ కంపెనీల ఉద్యోగులు, స్టార్టప్ ప్రతినిధులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ట్రాఫిక్ పరిష్కారాలపై చర్చించారు.
