వ్యాపారం

Gold loans : వడ్డీ చెల్లిస్తారా? లోన్ మొత్తం చెల్లిస్తారా? కస్టమర్లకు బ్యాంకుల ఫోన్ కాల్స్..ఎందుకంటే?

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో వాటి మీద రుణాలు తీసుకున్న వారికి బ్యాంకులు, ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలు వరుసగా కాల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. గతంలో బంగారం ధర రూ.2 లక్షలకు పైగా ఎగబాకింది.

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో వాటి మీద రుణాలు తీసుకున్న వారికి బ్యాంకులు, ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలు వరుసగా కాల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. గతంలో బంగారం ధర రూ.2 లక్షలకు పైగా ఎగబాకింది. వెండి సైతం కిలో రూ.4 లక్షల వరకు వెళ్లింది. అయితే, గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు క్రాష్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.1.28వేల వరకు ఉండగా, వెండి కిలో రూ.1.60వేలకు పైగా కొనసాగుతోంది.

అయితే, బంగారం ధర రూ.2 లక్షల వరకు ఉన్న సమయంలో బ్యాంకులు, ప్రయివేటు ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నవారికి ప్రస్తుతం వరుసగా కాల్స్ వస్తున్నట్టు సమాచారం. వడ్డీ మొత్తం ఒకేసారి చెల్లించాలని లేదా ప్రస్తుతం బంగారం ధర ఉన్న ప్రకారం లోన్లు రీషెడ్యూల్ చేసుకోవాలని బ్యాంకు అధికారులు, ఫైనాన్స్ సంస్థలు కోరుతున్నట్టు తెలిసింది. నిర్ణీత సమయంలోగా అసలు మొత్తం చెల్లించి రుణాలు రీషెడ్యూల్ చేసుకోకపోతే కస్టమర్ బంగారం లేదా ఆభరణాలు వేలం వేస్తామని చెబుతున్నట్టు తెలిసింది. దీంతో రుణాలు తీసుకున్న వ్యక్తులు తలలు పట్టుకుంటున్నారు.

బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఇలా చేయడానికి కారణం ఏంటేంటే?

బంగారం ధరలు భారీగా పడిపోయినప్పుడు బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు (NBFCs) రుణగ్రహీతలకు నోటీసులు పంపి, కొంత నగదు చెల్లించమని లేదా అదనపు బంగారం జమ చేయమని అడుగుతాయి. దీనినే ఆర్థిక పరిభాషలో ‘మార్జిన్ కాల్’(Margin Call) అంటారని తెలుస్తోంది.

లోన్-టు-వాల్యూ :

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం రుణ కాలపరిమితి అంతటా తాకట్టు పెట్టిన బంగారం విలువలో నిర్దేశిత శాతానికి మించి లోన్ ఉండకూడదు. 2026 నిబంధనల ప్రకారం రూ.2.5 లక్షల వరకు 85%, రూ.2.5 నుంచి రూ.5 లక్షల వరకు 80%, ఆపై మొత్తానికి గరిష్ఠంగా 75% వరకు మాత్రమే లోన్-టు-వాల్యూ (LTV) పరిమితి ఉంటుంది.

ఉదా.. రూ.లక్ష విలువైన బంగారంపై 75% లోన్ టు వాల్యూ ప్రకారం రూ.75,000 లోన్ తీసుకుంటే.. బంగారం ధర 20% తగ్గితే, ఆ బంగారం విలువ రూ.80వేలకు పడిపోతుంది. అప్పుడు 75% రూల్ ప్రకారం మీకు గరిష్ఠంగా రూ.60వేల రుణం మాత్రమే అర్హత ఉంటుంది. కానీ మీ అసలు బాకీ రూ.75వేలు (వడ్డీ అదనం) అలాగే ఉండటంతో, లోన్ టు వాల్యూ నిష్పత్తి 93% దాటుతుంది. ఆ వ్యత్యాసమైన రూ.15,000 కట్టాలని బ్యాంకులు, ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలు అడుగడం సాధారణం.

బంగారం ధరలు తగ్గితే బ్యాంకులకు వచ్చే నష్టాలు ఏమిటి?

బంగారం ధరలు ఉన్నట్టుండి పడిపోతే సెక్యూరిటీ మార్జిన్ తగ్గుతుంది. అనగా తాకట్టు పెట్టిన బంగారం విలువ కంటే రుణ బకాయి (అసలు + వడ్డీ) ఎక్కువైతే, సంస్థల వద్ద ఉన్న భద్రత (Collateral) బలహీనంగా మారుతుంది. ఫలితంగా బంగారం విలువ కంటే తాము కట్టాల్సిన అప్పు ఎక్కువే ఉందని భావించే కొందరు ఖాతాదారులు లోన్ తిరిగి చెల్లించడానికి ఆసక్తి చూపకపోవచ్చు.

వేలంలో నష్టం & NPA భారం..

ఖాతాదారు అప్పు కట్టకపోతే బ్యాంకులు ఆ బంగారాన్ని వేలం వేయాల్సి ఉంటుంది. ఇది కామన్. మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పుడు వేలం వేసినా పూర్తి బకాయి వసూలు కాదు. దీనివల్ల సంస్థలకు మొండి బకాయిలు (NPA) పెరిగి ఆర్థిక నష్టాలు వాటిల్లుతాయి. ఫలితంగా ఆ లోటును పూడ్చడానికి తిరిగి చార్జీల రూపంలో వినియోగదారులకే తిరిగి వస్తాయి. ఒకరు అప్పు చెల్లించకపోతే మిగతా వినియోగదారుల మీద ఇటీవల బ్యాంకుల చార్జీల బాదుడు పేరిట భారం వేశాయి. అందుకే ముందుజాగ్రత్తగా బకాయి తగ్గించుకోవాలని బ్యాంకులు, ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలు ఒత్తిడి చేస్తుండటం గమనార్హం.

తర్వాత చదవండి