రాజకీయాలు

Cm Revanth Reddy : ప్రధాని పదవిని శాశ్వతం చేసుకోవడానికి మోడీ కుట్ర : సీఎం రేవంత్ రెడ్డి

కేంద్రంలో నాలుగోసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుని, ప్రధాని పదవిని శాశ్వతం చేసుకోవడానికి నరేంద్ర మోడీ కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.అందుకోసం ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకుంటున్నాని అన్నారు.

కేంద్రంలో నాలుగోసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుని, ప్రధాని పదవిని శాశ్వతం చేసుకోవడానికి నరేంద్ర మోడీ కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.అందుకోసం ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకుంటున్నాని అన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. బీ.ఆర్.అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన సాగింది.

కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక ప్రసంగం చేశారు. దేశ ప్రజలకు సమాన న్యాయం, హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగ రూపకల్పన జరిగిందని, దళితులు, గిరిజనులు, మహిళలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు నాడు జరిగిన కుట్రలను అంబేడ్కర్ తిప్పికొట్టారని చెప్పారు. అందుకే ఓటు హక్కు అందిరికీ సాధ్యం అయిందన్నారు. ప్రజలకు సేవ చేసే నాయకుడిని ప్రజలే ఎన్నుకునే గొప్ప అవకాశాన్ని అంబేడ్కర్ అందించారని చెప్పారు. పరిపాలనను ప్రజల చేతుల్లో పెట్టింది రాజ్యాంగమేనని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ రాజ్యాంగమే సాయం చేసిందన్నారు.

ప్రధాని మోడీ కుట్రలు..

రాజ్యాంగంపై దాడికి కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరీపై ఉందని సీఎం పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇప్పుడు నాలుగోసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుని, ప్రధాని పదవిని శాశ్వతం చేసుకోవడానికి మోడీ కుట్రలు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. అందుకోసం ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా పేదలు, గిరిజనులు, ఆదివాసీలకు చెందిన 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించారని సీఎం రేవంత్ ఆరోపించారు. మూడు పర్యాయాలు మాయమాటలతో అధికారంలోకి వచ్చిన మోడీని నాలుగోసారి అప్రమత్తంగా ఉండి ప్రజలు అడ్డుకోవాలని సూచించారు.

గాంధీ వర్సెస్ గాడ్సే..

గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేతలు దేశం కోసం ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలు కూడా చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.కాగా, బీజేపీ నేతలను ‘గాడ్సే వారసులు’గా సీఎం అభివర్ణించారు. రాబోయే ఎన్నికలు ‘గాంధీ వర్సెస్ గాడ్సే వారసుల’కు మధ్య జరుగుతాయన్నారు. దేశం ప్రమాదంలో ఉందని, కాపాడటం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించాల్సిన లక్ష్యాలను సీఎం రేవంత్ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. తెలంగాణలో కోటి ఓట్లను సాధించాలని, 90 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 15 ఎంపీ సీట్లు గెలిచి, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

తర్వాత చదవండి