క్రైమ్

InterCast love : వేరే కులం వ్యక్తిని లవ్ చేసిందని.. కూతురి దారుణ హత్య

కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి సక్సెస్ కావడం లేదు. ఎక్కడో చోట కులాంతర వివాహాలు (Inter Cast marriages) జరుగుతున్నా కుటుంబ పెద్దలు పరువు కోసం సొంత బిడ్డలను సైతం కడతేర్చడానికి వెనుకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది.

దేశంలో కులపిచ్చి ఇంకా పోవడం లేదు. సాంకేతికతలో మనం ఎంత ముందున్నా కులం గోడలను మాత్రం బద్దలు కొట్టలేకపోతున్నాం.కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి సక్సెస్ కావడం లేదు. ఎక్కడో చోట కులాంతర వివాహాలు (Inter Cast marriages) జరుగుతున్నా కుటుంబ పెద్దలు పరువు కోసం సొంత బిడ్డలను సైతం కడతేర్చడానికి వెనుకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో కన్నతండ్రే ఆమెకు ఉరివేసి హత్య చేశాడు. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రిలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్, సుమ్రిత దంపతులకు కూతురు కళ్యాణి (18) ఉంది. నిన్న నార్నూర్‌కు చెందిన మరో యువకుడితో ఆమెకు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కాగా, ఈనెల 23న ఉదయం కళ్యాణి తల్లిదండ్రులతో కలిసి పత్తి ఏరేందుకు వెళ్లింది. కాసేపటికే తనకు కడుపు నొప్పిగా ఉందంటూ తిరిగి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చిన పేరెంట్స్ కూతురు దిగులుగా ఉండటం చూసి ఏమైందని గట్టిగా ప్రశ్నిచండంతో తాను ఓ యువకుడిని ప్రేమించినట్టు చెప్పింది.

అయితే, ఆ యువకుడిది వేరే కులం కావడంతో ఆగ్రహించిన తండ్రి.. రాత్రి అందరూ నిద్రిస్తుండగా కూతురిని చంపేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాడు. మంగళవారం ఉదయం లేచి చూసే సరికి ఇంట్లో దూలానికి కూతురు వేలాడుతూ కనిపించడంతో తల్లి ఒక్కసారిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అంతా అక్కడకు చేరుకోగా ఆత్మహత్య చేసుకున్నదని భావించారు. అనంతరం కొన్ని గంటల్లోనే మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.

పెళ్లికానివారిని పూడ్చి పెట్టకుండా ఖననం చేయడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం కాస్త పోలీసుల వరకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించారు. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించి తానే గొంతునులిమి హత్య చేసి విషయం బయటకు రాకుండా చున్నీతో ఉరేసుకున్నట్టు చిత్రీకరించినట్టు ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తర్వాత చదవండి