తెలంగాణ

Kishan Reddy: ఢిల్లీ పెద్దల ఫోకస్ పెరిగిన వేళ.. కిషన్ రెడ్డి నయా పొలిటికల్ స్కెచ్ అందుకేనా?

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్ఠానం గట్టిగా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీ పెద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టిన వేళ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తన పొలిటికల్ గేర్ మార్చేశారు.

Kishan Reddy: తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్ఠానం గట్టిగా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీ పెద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టిన వేళ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తన పొలిటికల్ గేర్ మార్చేశారు. పైకి చాలా సాఫ్ట్‌గా కనిపిస్తూనే, ప్రత్యర్థుల ఊహకు అందని విధంగా వ్యూహాలు రచించడం ఆయన స్టైల్. అయితే, రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్‌లో మరింత కీలకంగా మారాలని, కేంద్ర నాయకత్వం రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తనను దాటి వెళ్లకూడదని కిషన్ రెడ్డి గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే ఫుల్లీ ఛార్జ్ మోడ్‌లోకి వచ్చేసి, ‘నశాముక్త్ భారత్’ యాత్ర పేరుతో సరికొత్త పొలిటికల్ స్కెచ్‌ను అమలు చేస్తున్నారు.

క్రెడిట్ మిస్ కాకుండా ముందే అలర్ట్!

ఇటీవలి కాలంలో కిషన్ రెడ్డి వేస్తున్న రాజకీయ అడుగులను గమనిస్తే, ఆయన ఎంత పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నారో స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఏదైనా మేలు జరగబోతోందన్న సమాచారం ఉంటే చాలు.. అది పూర్తి స్థాయిలో బీజేపీకి రాజకీయంగా కలిసొచ్చేలా ఆయన ముందే రంగంలోకి దిగిపోతున్నారు. తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిన సందర్భమే ఇందుకు నిదర్శనం. ఆ ప్రకటన రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతంలో రెండు రోజుల పాటు యాత్ర చేసి, ఆ క్రెడిట్‌ను పార్టీ ఖాతాలో వేసుకున్నారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడా వెనకడుగు వేయకూడదన్నదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.

‘రాజకీయాలకు అతీతం’ అంటూనే..

మరోవైపు, దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన ‘సేవ్ డెమోక్రసీ - రిమూవ్ అనార్కీ’ యాత్రలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మహా పాదయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరై కేడర్‌లో కొత్త జోష్ నింపారు. సరిగ్గా ఇదే ఊపును కొనసాగిస్తూ, కిషన్ రెడ్డి ఇప్పుడు తన సొంత లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఆయన ఎంచుకున్న నినాదం ‘నశాముక్త్ భారత్’.

ఇక్కడే కిషన్ రెడ్డి అసలు రాజకీయ చతురత దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువతలో చైతన్యం తెచ్చేందుకే ఈ యాత్ర అని, ఇది పూర్తిగా ‘రాజకీయాలకు అతీతం’ అని ఆయన ప్రకటించారు. కానీ, అదే సమయంలో తన యాత్రకు బీజేపీ మద్దతు ఇవ్వాలని కోరడం వెనుక లోతైన వ్యూహం కనిపిస్తోంది. రాజకీయాలకు అతీతం అనడం వల్ల పార్టీలకు సంబంధం లేని సాధారణ ప్రజలు, యువత కలిసి వస్తారు.. అదే టైమ్‌లో పరోక్షంగా బీజేపీని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఆ వర్గాలన్నింటినీ కమలం వైపు తిప్పుకోవచ్చన్నది ఆయన మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.

సెలబ్రిటీలు, స్టూడెంట్స్.. పక్కా ప్లానింగ్‌తో ముందుకు

ఈ పాదయాత్రను ఏదో నామమాత్రంగా కాకుండా అత్యంత ప్రణాళికాబద్ధంగా నడిపిస్తున్నారు. యాత్ర సాగే మార్గంలో ఉన్న స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేస్తూ యువతకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, విద్యావేత్తలను సైతం ఆహ్వానిస్తూ.. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల్లో తనకు, పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడేలా జాగ్రత్త పడుతున్నారు.

అధికారమే లక్ష్యంగా కీలక పాత్ర

చూడటానికి ఇది ఒక సామాజిక చైతన్య కార్యక్రమంలా కనిపిస్తున్నా, దీని వెనుక పక్కా రాజకీయ లెక్కలు ఉన్నాయన్నది పొలిటికల్ పండిట్స్ మాట. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, తెలంగాణపై హైకమాండ్ పెట్టిన స్పెషల్ ఫోకస్‌ని దృష్టిలో ఉంచుకుని.. వీలైనంత ఎక్కువగా ప్రజల మధ్యే ఉండాలని కిషన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్ర ద్వారా అటు వ్యక్తిగతంగా తన పట్టును నిరూపించుకోవడంతో పాటు, ఇటు పార్టీకి కూడా భారీగా లబ్ధి చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే ప్రక్రియలో తన పాత్రే కీలకం కావాలన్న పట్టుదలతో కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తర్వాత చదవండి