తెలంగాణ

తెలంగాణలో పెరగనున్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు.. డీలిమిటేషన్‌తో మారనున్న రాజకీయ ముఖచిత్రం!

డీలిమిటేషన్ బిల్లు పాసైతే.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రమే మారిపోనుందా..? అవును.. కేంద్రం భావిస్తున్నట్టు ఈ బిల్లు గట్టిక్కితే.. తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు భారీగా పెరిగే అవకాశముంది. మరి కొత్త సీట్లు ఏ ప్రాంతంలో వస్తాయి..?

తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు?

119 నుంచి 179కు పెరగనున్న ఎమ్మెల్యే స్థానాలు?

మహిళలకు సుమారు 60 అసెంబ్లీ సీట్లు దక్కే అవకాశం

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్త నియోజకవర్గాల ప్రభావం

డీలిమిటేషన్‌తో మారనున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం

తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతోందా? డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొంది, కేంద్రం ప్రతిపాదిస్తున్న 50 శాతం సీట్ల పెంపు అమల్లోకి వస్తే రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 17గా ఉన్న లోక్‌సభ స్థానాలు సుమారు 26కు చేరవచ్చు. 119గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 179కు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంటే రాష్ట్రానికి కొత్తగా 9 ఎంపీ స్థానాలు, 60 ఎమ్మెల్యే స్థానాలు అందుబాటులోకి రావచ్చు. మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వస్తే రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. అయితే ఈ మార్పులు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? జిల్లాల వారీగా నియోజకవర్గాల సంఖ్య ఎలా మారుతుంది? అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి?

17 నుంచి 26కు.. ఎంపీ స్థానాల్లో భారీ పెరుగుదల!

ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలున్నాయి. కేంద్రం పరిశీలిస్తున్న 50 శాతం పెంపు ప్రతిపాదన ప్రకారం ఈ సంఖ్య సుమారు 25 నుంచి 26కు చేరవచ్చు. అంటే కొత్తగా 8 నుంచి 9 ఎంపీ స్థానాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 50 శాతం లెక్కన 25.5 వస్తుంది కాబట్టి తుది కేటాయింపులో 25 లేదా 26 స్థానాలుగా మారవచ్చు. ఇదే జరిగితే తెలంగాణ నుంచి పార్లమెంటుకు వెళ్లే ప్రజాప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం 17 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్తగా మరో 8 లేదా 9 మంది ప్రజాప్రతినిధులకు అవకాశం ఏర్పడుతుంది.

అయితే ఈ పెంపు కేవలం సంఖ్యకు సంబంధించిన మార్పు మాత్రమే కాదు. నియోజకవర్గాల భౌగోళిక పరిధులు కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు మారిపోవచ్చు. జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఇతర ప్రమాణాల ఆధారంగా కొత్త పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏర్పడతాయి.

119 నుంచి 179కు.. అసెంబ్లీలోనూ భారీ మార్పు!

లోక్‌సభతో పాటు తెలంగాణ అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో 119 ఎన్నికైన స్థానాలున్నాయి. వీటిని 50 శాతం పెంచితే సుమారు 179కు చేరుతాయి. అంటే అదనంగా 60 మంది ఎమ్మెల్యేలకు అవకాశం ఏర్పడుతుంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామం. ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీ 179 మంది సభ్యులతో కూడిన సభగా మారవచ్చు.

ఇక్కడ మరో అంశాన్ని గమనించాలి. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ప్రస్తుత నియోజకవర్గాల సరిహద్దులు యథాతథంగా ఉండవు. కొన్ని పెద్ద నియోజకవర్గాలు విడిపోయే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో జనాభా వేగంగా పెరిగిన ప్రాంతాలకు కొత్త నియోజకవర్గాలు ఏర్పడవచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

అయితే ఏ జిల్లాలో ఎన్ని కొత్త నియోజకవర్గాలు వస్తాయన్నది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. జనాభా లెక్కలు, భౌగోళిక పరిస్థితులు, డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాల ఆధారంగానే తుది రూపం వస్తుంది.

మహిళలకు సుమారు 60 ఎమ్మెల్యే స్థానాలు?

డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్ అమలు కూడా ఈ ప్రతిపాదనలో కీలకమైన భాగం. 2023లోనే పార్లమెంటు మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ఆమోదించింది. అయితే జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాతే ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం చర్చలో ఉన్న కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రక్రియను ముందుకు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 179కు పెరిగితే, అందులో మూడింట ఒక వంతు అంటే సుమారు 60 స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లోక్‌సభ స్థానాలు 26కు చేరితే దాదాపు 9 స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ఇప్పటివరకు పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఎన్నికల రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. రాజకీయ పార్టీలకు కూడా మహిళా అభ్యర్థులను పెద్ద సంఖ్యలో సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే ఏ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయి? ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో వాటి సమన్వయం ఎలా ఉంటుంది? రిజర్వ్ చేసిన స్థానాలను ఎలా మారుస్తారు? ఇవన్నీ డీలిమిటేషన్ ప్రక్రియలో తేలాల్సిన అంశాలు.

రాజకీయ పార్టీలకు కొత్త సవాళ్లు!

సీట్ల సంఖ్య పెరిగితే తెలంగాణలో రాజకీయ పార్టీల వ్యూహాలు కూడా మారాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల ఆధారంగా పార్టీలు నిర్మించుకున్న రాజకీయ వ్యవస్థలో మార్పులు రావచ్చు. కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే కొత్త నాయకత్వానికి అవకాశాలు వస్తాయి. ఇప్పటివరకు ఒకే నియోజకవర్గంలో పోటీ పడుతున్న నాయకులకు వేర్వేరు ప్రాంతాల్లో పోటీ చేసే అవకాశం రావచ్చు. మరోవైపు పార్టీలకు అభ్యర్థుల ఎంపిక పెద్ద సవాలుగా మారుతుంది. కొత్త నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకత్వం, జనాభా పంపిణీ ఆధారంగా రాజకీయ వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జనాభా పెరుగుదల, కొత్త నివాస ప్రాంతాల విస్తరణ కారణంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రాధాన్యం సంతరించుకోనుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద నియోజకవర్గాల పరిధులు మారే అవకాశం ఉంది.

179 సీట్లు ఖరారయ్యాయా?

ఇక్కడే అసలు విషయం ఉంది. ప్రస్తుతం చర్చలో ఉన్నది అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం చొప్పున సీట్లు పెంచే ప్రతిపాదన. కానీ ఈ ఫార్ములా తుది బిల్లులో చట్టబద్ధంగా ఖరారైందని చెప్పలేం. డీలిమిటేషన్ బిల్లు ప్రకారం లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు కూడా కమిషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. అయితే తెలంగాణకు ఖచ్చితంగా 26 ఎంపీ స్థానాలు, 179 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని ఇప్పుడే నిర్ధారించలేం.

కేంద్రం గతంలో ఇచ్చిన 50 శాతం పెంపు హామీని ఈసారి బిల్లులో స్పష్టంగా పొందుపరుస్తుందా? జనాభా ఆధారంగా స్థానాల కేటాయింపులో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తుంది? దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలకు ఎలాంటి పరిష్కారం చూపుతుంది? అన్నది కీలకం. డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు వెళ్తే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారే అవకాశం ఉంది. ఎంపీలు 17 నుంచి 26కు, ఎమ్మెల్యేలు 119 నుంచి 179కు పెరిగే పరిస్థితి వస్తే అది రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద నిర్మాణాత్మక మార్పుల్లో ఒకటిగా నిలుస్తుంది.

కొత్త నియోజకవర్గాలు.. కొత్త నాయకత్వం.. మహిళలకు పెరిగే ప్రాతినిధ్యం.. మారనున్న ఎన్నికల సమీకరణాలు. మరి తెలంగాణలో ఈ కొత్త రాజకీయ అధ్యాయం ఎప్పుడు ప్రారంభమవుతుంది? డీలిమిటేషన్ కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్నలివే. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు.

తర్వాత చదవండి