హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ సర్కిల్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. కార్యాలయ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఓ గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కిటికీల్లో నుంచి పొగలు రావడం గమనించిన క్లీనింగ్ స్టాఫ్ వెంటనే అధికారులకు సమాచారం అందించినట్టు తెలిసింది.
దీంతో వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.మూడు అగ్నిమాపక యంత్రాల సాయంతో శ్రమించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కీలక డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతి అయినట్టు సమాచారం. కొన్ని కీలక పత్రాలు సైతం నీటికి తడిచి ముద్దయినట్టు తెలుస్తోంది.
అయితే, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు.నిజంగానే విద్యుత్ ప్రమాదం సంభవించిందా? లేక వేరే ఇతర శక్తులకు ఏమైనా ఈ ప్రమాదంలో ప్రమేయం ఉందా? అనేది విచారణలో తేలనుంది. సమాచారం అందుకున్న పోలీసులు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలపైనా సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్టు తెలిసింది. కాగా, ఈ ప్రమాదంలో ఎంతమేర ఆస్తి నష్టం సంభవించింది. ఏయే రికార్డులు కాలిపోయాయి అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
