తెలంగాణ

MG University: ఎంజీయూ హాస్టల్ మెస్‌లో రణరంగం.. విద్యార్థుల పరస్పర దాడులు!

మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MGU) హాస్టల్ మెస్ నిర్వహణ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. విద్యార్థుల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. గురువారం రాత్రి హాస్టల్ మెస్ నిర్వహణ, మెయింటెనెన్స్ బాధ్యతల విషయంలో రెండు వర్గాల విద్యార్థుల మధ్య మొదలైన వివాదం.. పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరింది.

 మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MGU) హాస్టల్ మెస్ నిర్వహణ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. విద్యార్థుల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. గురువారం రాత్రి హాస్టల్ మెస్ నిర్వహణ, మెయింటెనెన్స్ బాధ్యతల విషయంలో రెండు వర్గాల విద్యార్థుల మధ్య మొదలైన వివాదం.. పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఈ ఘటనతో క్యాంపస్ హాస్టల్ ఆవరణలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

 హాస్టల్ మెస్ నిర్వహణ, మెయింటెనెన్స్ అంశాలపై విద్యార్థుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి తరచూ వాగ్వాదాలకు దిగుతుండగా, తాజాగా ఆ వివాదం మరింత ముదిరి భౌతిక దాడులకు దారితీసింది. మెస్ బాధ్యతల విషయంలో నెలకొన్న ఈ విభేదాలే ప్రస్తుత ఘర్షణకు ప్రధాన కారణమని సమాచారం.

 విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న హాస్టల్ డైరెక్టర్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల విద్యార్థులతో మాట్లాడి నచ్చజెప్పడానికి యత్నించినప్పటికీ, మెస్ నిర్వహణపై నెలకొన్న సమస్యకు స్పష్టమైన పరిష్కారం లభించకపోవడంతో వివాదం పూర్తిగా సద్దుమణగలేదు. దీంతో విద్యార్థుల మధ్య విభేదాలు అలాగే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

 ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మెస్ నిర్వహణ, మెయింటెనెన్స్ వివాదంపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తర్వాత చదవండి