రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ను బోనులో నిలబెట్టబోయి సీఎం రేవంత్ రైతులను బోనులో నిలబెట్టారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఉండగా ఈ ప్రాంతానికి కరువు రాదని ఎప్పుడో చెప్పాడని, ప్రాణహిత నుంచి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని చెప్పారు. 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయన్న భ్రమల్లో రేవంత్ రెడ్డి ఉన్నారని, కాంగ్రెస్ పార్టీకి మరో 15 ఏళ్ల పాటు అధికారం రాదంటున్నది ఆ పార్టీ కార్యకర్తలే అని విమర్శించారు. ఇవాళ తన పార్లమెంటరీ నియోజకవర్గంలో మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడారు.
1999–2004 మధ్య తీవ్ర కరువు వచ్చినా అప్పట్లో రైతులను పంటలు వేయొద్దని ఎవరూ చెప్పలేదని, పంటలు వేయొద్దని చెప్పే దుస్థితికి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. పంటలు వేయొద్దని చెప్పిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ధ్వజమెత్తారు. ఒక్క కరువుకే ప్రజలను ఇంత ఆగం చేస్తారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అంత పెద్దగా కరువు లేదని,కాళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ఉన్నదని ఆ నీటిని ఎత్తిపోస్తే అన్నదాతలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు.కానీ, సీఎం రేవంత్ రెడ్డి నీటిని ఎత్తిపోయకుండా పంటలు వేయొద్దని రైతులకు చెప్పడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. గ్రామాల్లో నాణ్యమైన కరెంట్ రావడం లేదని ఫలితంగా బోర్లు పనిచేయక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి అన్నదాతలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. లేదంటే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.
