ప్రభుత్వ రంగ సంస్థలపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం రంగంపై ఉన్న భారీ రుణభారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ రంగ సంస్థల మిగులు ఆస్తులను విక్రయించే 'నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఎన్ఎల్ఎంసీ) తన 22వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలకు చెందిన సుమారు రూ. 1,300 కోట్ల విలువైన నాన్-కోర్ ఆస్తుల నగదీకరణ ప్రతిపాదనను ముందుకుతెచ్చింది.
పేరుకుపోతున్న అప్పులు..
2025-26 ఫైనాన్షియల్ ముగిసేనాటికి MTNL అప్పులు రూ.40వేల కోట్లు, BSNL అప్పులు రూ.28వేల కోట్లుగా ఉన్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15వేల కోట్ల ఆస్తులను నగదుగా మార్చాలని ఎన్ఎల్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూ.9వేల కోట్లకుపైగా ఆస్తులను నగదీకరించినట్టు సమాచారం.తాజాగా వైజాగ్‌లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) తరఫున నిర్వహించిన ఈ-వేలంలో రూ. 584.40 కోట్ల బిడ్లను సాధించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
న్యూఢిల్లీ,ముంబైలలో వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి సేకరించిన 17 నివాస ఆస్తుల విలువ నిర్ధారణ నివేదికలను కూడా బోర్డు సమీక్షించి, త్వరలోనే రిజర్వ్ ధరలను ఖరారు చేసి ఈ వేలం ద్వారా విక్రయించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, గతంలో కూడా బీఎస్ఎన్ఎల్ (BSNL) ఆస్తులను వేలం వేసింది. 2019లో కేంద్రం ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీలో భాగంగా అప్పులను తగ్గించుకునేందుకు ఆస్తుల నగదీకరణ (Asset Monetization) ప్రక్రియను చేపట్టారు.
2021లో దీపం (DIPAM) స్కీం ద్వారా హైదరాబాద్ (సుమారు 11 ఎకరాలు), కోల్‌కతా, పంజాబ్ (రాజ్‌పురా), గుజరాత్ (భావ్‌నగర్) తదితర ప్రాంతాల్లోని ఆస్తుల విక్రయానికి నోటిఫికేషన్ ఇచ్చారు.కానీ, అప్పట్లో హైదరాబాద్ సహా కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో బిడ్లు దాఖలు కాలేదు.2022 చివర్లో నిబంధనలను మార్చి రూ. 100 కోట్లలోపు విలువైన ఆస్తులను నేరుగా విక్రయించే బాధ్యతను టెలికాం విభాగం/బీఎస్ఎన్ఎల్కు అప్పగించారు. దీని కింద ఏపీ , తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 ఆస్తులను MSTC పోర్టల్ ద్వారా ఈ-వేలానికి పెట్టారు. పార్లమెంట్‌కు టెలికాం విభాగం (DoT) సమర్పించిన గణాంకాల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భూముల విక్రయాల ద్వారా బీఎస్ఎన్ఎల్కు రూ. 759 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 581.78 కోట్లు సమకూరినట్టు తెలిసింది.
