నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు (Delimitation Bill) శరద్ పవార్ (SharadPawar) నేతృత్వంలోని ఎన్సీపీ(NCP)తో పాటు డీఎం(DMK)కే కూడా మద్దతు ప్రకటించడంతో దేశ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించుకునేందుకు మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ అవసరమైన నేపథ్యంలో, ఈ రెండు పార్టీల నిర్ణయం అధికార పక్షానికి బలాన్ని చేకూర్చింది.
సుప్రియా సూలేకు కేంద్ర మంత్రి పదవి? విపక్ష సమావేశానికి దూరం
ఇదే అంశంపై శరద్ పవార్ కాంగ్రెస్ అధిష్టానానికి ఫోన్ చేసి బిల్లుకు మద్దతు ఇవ్వడం అత్యవసరమని స్పష్టం చేయగా, ఎన్సీపీ నిర్ణయంపై మహారాష్ట్ర కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలిపినందుకు ప్రతిఫలంగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే (SupriyaSule)కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం(Maharastra govt)లో రెండు రాష్ట్ర మంత్రి పదవుల కోసం ఎన్సీపీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. లోక్సభలో 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ వర్గం, నేడు ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి సుప్రియా సూలే హాజరుకావడం లేదని సమాచారం.
డీఎంకే తీర్మానం.. ఏ.రాజా స్పష్టీకరణ
మరోవైపు శనివారం ఉదయం జరిగిన డీఎంకే ఎంపీల సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. తాము 7.18 శాతం వాటా తగ్గకూడదని కోరగా, అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే నిబంధనతో కేంద్రం దానికి మించి ఇచ్చిందని డీఎంకే పేర్కొంది. కొత్త డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని డీఎంకే ఎంపీ ఏ.రాజా(DMK MP A.Raja) స్పష్టం చేయగా, లోక్సభలో 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే మద్దతుతో పాటు టీఎంసీ చీలిక వర్గం ఎంపీలు కూడా అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉండటంతో బిల్లు ఆమోదం దిశగా పరిస్థితులు మారుతున్నాయి.
