ఆరోగ్యం

Health Tips : నిద్రలో పదే పదే మెలకువ వస్తుందా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే?

ఆధునిక జీవన శైలి(Lifestyle)లో చాలా మంది ఒత్తిడితో కూడిన జీవనాన్ని గడుపుతున్నారు. ఫలితంగా రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర కూడా పోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. నిద్ర పట్టడం లేదని చాలా మంది ఆస్పత్రికి వెళ్తున్నారని, మరికొందరు రాత్రిళ్లు నిద్రలో పదే పదే మెలకువ వస్తోందని కోర్సు తీసుకుంటున్నట్టు సమాచారం.

ఆధునిక జీవన శైలి(Lifestyle)లో చాలా మంది ఒత్తిడితో కూడిన జీవనాన్ని గడుపుతున్నారు. ఫలితంగా రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర కూడా పోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. నిద్ర పట్టడం లేదని చాలా మంది ఆస్పత్రికి వెళ్తున్నారని, మరికొందరు రాత్రిళ్లు నిద్రలో పదే పదే మెలకువ వస్తోందని కోర్సు తీసుకుంటున్నట్టు సమాచారం. అసలు ఇలా ఎందుకు అవుతుంది? అందుకు గల కారణాలు ఏమిటి? నిద్రలో మెలకువ రావడం సాధారణ సమస్యే అయినప్పటికీ ఇది దీర్ఘకాలం కొనసాగితే అశ్రద్ధ వహించరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి అనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా, మన దైనందిన అలవాట్లు, మానసిక ఒత్తిడి కూడా ప్రధాన కారణాలు కావచ్చని స్పష్టంచేశారు.

జీవనశైలి, అలవాట్లు

మనిషి తీవ్ర ఒత్తిడికి గురైనా, ఆందోళన (Stress & Anxiety)ని ఎదుర్కొంటున్నప్పుడు రాత్రి నిద్రలో మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేక తరచూ మెలకువ వస్తుంది. అప్పుడు గాఢ నిద్ర పట్టదు. పదే పదే నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇక సాయంత్రం లేదా రాత్రి వేళల్లో టీ, కాఫీ వంటివి తాగడం వల్ల నిద్ర గాఢంగా పట్టదు.అలాగే మద్యం (Alcohol) తీసుకుంటే మొదట్లో నిద్ర వచ్చినట్లు అనిపించినా, అర్ధరాత్రి తర్వాత నిద్ర భంగమవుతుందని సమాచారం.

స్క్రీన్ టైమ్ తగ్గించాలి..

నిద్రపోయే ముందు కొందరికి మొబైల్ లేదా టీవీ చూడటం అలవాటు ఉంటుంది. వాటి వలన వచ్చే నీలి కాంతి (Blue light) నిద్రను ప్రేరేపించే 'మెలటోనిన్' హార్మోన్ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తుంది. గదిలో వేడి ఎక్కువగా ఉండటం, శబ్దాలు, వెలుతురు లేదా సరిపడని పరుపు/దిండు కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అందుకే పడుకునే గంట ముందే సెల్ ఫోన్, టీవీలు బంద్ చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అనారోగ్య సమస్యలు

నిద్రలో శ్వాస తీసుకోవడంలో క్షణకాలం అంతరాయం కలగడం లేదా శ్వాస ఆగిపోయినట్లు అనిపించడం వల్ల వెంటనే మెలకువ వచ్చేస్తుంది. గురక పెట్టేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాకుండా, రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి వచ్చి ఛాతీలో మంట లేదా అసౌకర్యం కలిగి నిద్రకు భంగం వాటిల్లుతుంది. ఈ మధ్యకాలంలో రాత్రి వేళల్లో కాళ్ళను కదపాలనే బలమైన కోరిక లేదా కాళ్ళలో లాగినట్లు/జలదరించిడాన్ని రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ (Restless Legs Syndrome) అని అంటారు.

థైరాయిడ్ లేదా హార్మోన్ల సమస్యలు

థైరాయిడ్ అసమతుల్యత, మధుమేహం (రాత్రి వేళల్లో రక్తంలో చక్కెర స్థాయిలు మారడం వల్ల పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం), లేదా వయస్సు పెరిగే కొద్దీ వచ్చే మార్పులు వలన కూడా నిద్రకు భంగం కలుగుతుంది. అందకే తరచూ రక్తపరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

పొంచి ఉన్న ప్రమాదం?

నిద్ర తరచూ భంగమవడం వల్ల శరీరానికి అందాల్సిన గాఢ నిద్ర (Deep Sleep) లోపిస్తుంది. ఫలితంగా పగటిపూట నీరసం, ఏకాగ్రత లోపించడం, మతిమరుపు, పనిలో చురుకుదనం తగ్గడం వంటివి జరుగుతాయి.మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి చిరాకు, కోపం, డిప్రెషన్ లేదా ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. నిరంతరం నిద్ర సరిపోకపోవడం వల్ల అధిక రక్తపోటు (BP), గుండె సంబంధిత సమస్యలు, బరువు పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది.

తర్వాత చదవండి