రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు ఈ పంపిణీ చేయనున్నారు. నవంబర్ 26న నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి ఇందిరమ్మ చీరలను అందిస్తోంది.
రెండు రంగుల్లో చీరలు..
ఈసారి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు కలిపి కోటి చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మందికి చీరలు అందించనున్నారు. మహిళల అభిరుచికి అనుగుణంగా ఆకర్షణీయమైన చిలకపచ్చ రంగులో ప్రత్యేకంగా చీరలను ప్రభుత్వం తయారు చేయించింది. రెండు రకాల డిజైన్లలో వీటిని సిద్ధం చేశారు.
గతంలో కేవలం మహిళా స్వయం సహాయక సంఘాల వారికి మాత్రమే ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వాస్తవానికి ఈనెల 21న ఇందిరాగాంధీ జయంతి నాడు ఈ కార్యక్రమాన్ని సిద్ధిపేట వేదికగా సీఎం రేవంత్ ప్రారంభించాల్సి ఉంది.కానీ,చివరి నిమిషంలో ఈ ప్రోగ్రామ్ వాయిదా పడింది. ఈనెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ పేరిట చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది.కానీ, వీటిని బతుకమ్మ పండుగకు ముందు పంచాల్సి ఉండగా, అయిపోయాక అందించేందుకు ప్లాన్ చేశారు.
18 ఏళ్లు పైబడిన వారే అర్హులు..
తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయనున్న కోటి చీరల్లో 95 లక్షలు పాలిస్టర్ చీరలు కాగా, మరో 5 లక్షలు పాలీకాటన్ చీరలు ఉన్నాయి. రేషన్ కార్డు కలిగి కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలను ఈ పథకానికి అర్హులుగా ఎంపిక చేశారు.అర్హులైన మహిళలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు చూపించి ఈ చీరలను పొందవచ్చు. పండుగ కానుకగా మహిళలకు ఇందిరమ్మ చీరలను అందించాలని ప్రభుత్వం భావించగా.. ఆలస్యం కావడంతో పండుగలు అయిపోయాక పంపిణీ చేయాల్సి వస్తోంది.
