Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. సాధారణంగా ఎన్నికలకు ఆరు నెలల ముందో, ఏడాది ముందో హడావిడి మొదలవుతుంది. కానీ జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం అప్పుడే పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయనే అంచనాలతో ప్రధాన పార్టీల మహిళా నేతలు రెండేళ్ల ముందే కుర్చీపై కర్చీఫ్ వేసే పనిలో పడ్డారు. ఇన్నాళ్లూ పురుషాధిక్య కోటగా ఉన్న జగిత్యాలలో ఈసారి ‘నారీ శక్తి’ ముద్ర వేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మహిళా నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే, వీరికి బయటి ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతల నుంచే అసలైన కష్టాలు, కుట్రలు ఎదురవుతుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
బీజేపీలో భోగ శ్రావణి దూకుడు..
ఒకప్పుడు కమలం పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కని జగిత్యాలలో, 2023 ఎన్నికల్లో పోటీ చేసిన భోగ శ్రావణి ఏకంగా 42 వేల ఓట్లు సాధించి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మహిళా రిజర్వేషన్ అయినా కాకపోయినా కమలదళం నుంచి శ్రావణే మళ్లీ బరిలో ఉంటారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పారు. మూడేళ్లుగా నియోజకవర్గంపై పట్టు సాధించిన శ్రావణి.. బలమైన పద్మశాలి సామాజిక వర్గంతో పాటు, ఎంపీ అరవింద్ సామాజిక వర్గమైన మున్నూరు కాపు ఓట్లు తనకు కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు.
కానీ, శ్రావణి దూకుడును సొంత పార్టీ సీనియర్లే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంపీ అరవింద్, శ్రావణి వ్యవహారశైలిని టార్గెట్ చేస్తూ లోకల్ బీజేపీ నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గంతో సన్నిహితంగా ఉంటూ వీరికి చెక్ పెట్టే పనిలో పడ్డారు. సొంత పార్టీలోని ఈ అంతర్గత పోరును దాటుకుని, 2023 నాటి ఇమేజ్ను వచ్చే ఎన్నికల దాకా నిలబెట్టుకోవడం శ్రావణికి ఇప్పుడు అసలైన పరీక్షగా మారింది.
జీవన్ రెడ్డి ఎంట్రీతో తలకిందులైన దావా వసంత లెక్కలు!
ఇక బీఆర్ఎస్లో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత ఎమ్మెల్యే టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో, ఇక తనకు లైన్ క్లియర్ అయిందని వసంత సంబరపడ్డారు. కానీ అనూహ్య రాజకీయ సమీకరణాల్లో భాగంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరడంతో వసంత ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
అయితే, భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగి జగిత్యాల మహిళలకు రిజర్వ్ అయితే జీవన్ రెడ్డి వేరే చోటు నుంచి పోటీ చేస్తారని, అప్పుడు తనకే అవకాశం దక్కుతుందని వసంత ఆశపడుతున్నారు. కానీ ఇక్కడా సొంత పార్టీ నుంచే మరో చిక్కు వచ్చి పడింది జీవన్ రెడ్డి చిన్న కోడలు చరిష్మా రెడ్డి కూడా టికెట్ రేసులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరే చోట జీవన్ రెడ్డికి, ఇక్కడ ఆయన కోడలికి ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇవ్వరనే ధీమాతో దావా వసంత ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు కవిత వర్గంగా గుర్తింపు పొందిన ఆమె, ప్రస్తుతం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మద్దతుతో జనంలో ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నారు.
కాంగ్రెస్‌లో అడవాల జ్యోతి ఆశలు..
హస్తం పార్టీలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి అసెంబ్లీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరిన తక్కువ సమయంలోనే అధిష్ఠానం దృష్టిలో పడిన ఆమెకు, ఈ ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇటీవలే ఆమెను జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించినా, ఆ నియామక పత్రం ఆలస్యంగా జారీ కావడం వెనుక సొంత పార్టీలోని ఒకరిద్దరు నేతలు కుట్ర పన్నారని, తనకు పదవి రాకుండా అడ్డుకున్నారని జ్యోతి బహిరంగంగానే ఆరోపించారు.
పునర్విభజనలో సీటు మహిళలకు దక్కితే తనకే కాంగ్రెస్ టికెట్ వస్తుందని జ్యోతి ఆశపడుతుండగా, మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సతీమణి రాధిక కూడా రేసులోకి దిగే అవకాశం లేకపోలేదు. మొత్తానికి జగిత్యాల పీఠంపై కన్నేసిన ఈ ముగ్గురు మహిళా నేతలకు బయట ప్రత్యర్థుల కంటే, సొంత పార్టీలోని గ్రూపు రాజకీయాలు, అంతర్గత కుట్రలే పెద్ద తలనొప్పిగా మారాయి. వచ్చే రెండేళ్లలో ఈ బాలారిష్టాలను అధిగమించి, సొంత పార్టీ నేతల పద్మవ్యూహాలను ఛేదించి అసెంబ్లీ బరిలో నిలిచేది ఎవరో చూడాలి.
