తెలంగాణ

Etela Rajender: ఈటల పాదయాత్ర.. బ్రేకులు వేస్తున్న రాష్ట్ర నేతలు

Etela Rajender: తెలంగాణ బీజేపీలో మరోసారి అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నేతలు పాదయాత్రల బాట పడుతుండగా, మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ వేస్తున్న కొత్త అడుగులు సొంత పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Etela Rajender: తెలంగాణ బీజేపీలో మరోసారి అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నేతలు పాదయాత్రల బాట పడుతుండగా, మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ వేస్తున్న కొత్త అడుగులు సొంత పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రతిపాదనకు ఢిల్లీ పెద్దల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినా, రాష్ట్ర స్థాయి నేతల నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయనే ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మల్కాజగిరి సక్సెస్‌తో ఈటల కొత్త వ్యూహం!

ఇటీవల జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలింపు సహా స్థానిక సమస్యలపై మల్కాజగిరి పార్లమెంట్ పరిధిలో ఈటల రాజేందర్ నాలుగు రోజుల పాటు సుమారు 60 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడమే కాకుండా, జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. ఇదే ఊపుతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని ఈటల భావిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని హైకమాండ్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పదవి లేకపోయినా ప్రజా సమస్యలనే అస్త్రంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా తన పట్టు పెంచుకోవాలనేది ఈటల ప్లాన్‌గా కనిపిస్తోంది.

సొంత పార్టీలోనే ఎందుకు రచ్చ జరుగుతోంది?

ఈటల దూకుడు పెంచడం తెలంగాణ బీజేపీలోని కొందరు సీనియర్లకు మింగుడుపడటం లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జవహర్‌నగర్ పాదయాత్ర సమయంలోనే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రారంభోత్సవానికి హాజరై, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన ద్వారా మద్దతు తెలిపినప్పటికీ.. మిగిలిన మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ యాత్రకు దూరంగా ఉండటం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్త యాత్ర విషయంలోనూ సొంత నేతలే బ్రేకులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

పార్టీలో ఇప్పటికే బలమైన బీసీ నేతలుగా బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, డాక్టర్ కె.లక్ష్మణ్ కొనసాగుతున్నారు. ఈటల రాష్ట్రవ్యాప్త యాత్ర చేస్తే పార్టీలో ఆయన ఇమేజ్ మరింత పెరిగి, భవిష్యత్తులో సీఎం అభ్యర్థి రేసులో ముందుంటారనే ఆందోళన కొందరిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్‌కు ఇంకా బీఆర్ఎస్‌తో లోపాయికారీ సంబంధాలు ఉన్నాయనే ప్రచారాన్ని సొంత పార్టీలోని ఓ వర్గం తెరపైకి తెస్తోంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విషయంలోనూ ఇలాంటి విమర్శలే వినిపిస్తుండటం పార్టీలోని విభేదాలకు అద్దం పడుతోంది.

ఏళ్ల తరబడి కమలం పార్టీని నమ్ముకున్న తమను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఊరుకోబోమని రాష్ట్ర బీజేపీలోని సీనియర్లు గట్టిగా వాదిస్తున్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలోనూ ఇదే తరహా ఒత్తిడితో ఈటలను కాదని రామచంద్రరావుకు అవకాశం ఇచ్చారనే చర్చ ఉంది. మొత్తానికి, ఒకవైపు జవహర్‌నగర్ సమస్య పరిష్కారమయ్యే వరకు విశ్రమించబోనని, అవసరమైతే రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని ఈటల సంకేతాలిస్తుండగా.. మరోవైపు సొంత గూటిలోనే ఆయనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. మరి ఈ అంతర్గత కుమ్ములాటలను దాటుకుని ఢిల్లీ పెద్దలు ఈటలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారో, లేక రాష్ట్ర నేతల అభ్యంతరాలకే తలొగ్గుతారో చూడాలి.

తర్వాత చదవండి