సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మాస్క్ వేసుకుని అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు కొంత తగ్గుముఖం పట్టాయని పోలీసులు ఇటీవల ప్రకటించారు. కానీ, ఆ మోసాలు మళ్లీ తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ వివరాలు, ఓటీపీలు చెప్పొద్దని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరు వినిపించుకోవడం లేదు. వాస్తవానికి ఏదో సర్వీస్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే వెంటనే సైబర్ నేరగాళ్లు కనెక్ట్ అవుతున్నారు. ఫోన్ నెంబర్స్ కనిపెట్టి మరీ కస్టమర్ సర్వీస్ పేరిట మాటలు కలిపి సామాన్యులను నిలువునా దోపిడీ చేస్తున్నారు.
తాజాగా ఓ సినీ నటి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఇరుకున్నారు. విమాన టికెట్ పేరిట సినీ యాక్టర్ అనితను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.4 లక్షలు కాజేశారు. దీంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురయ్యి పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకివెళితే.. మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో నివాసం ఉంటన్న సినీ నటి గోగినేని అనిత.. అమెరికాలోని వాషింగ్టన్లో ఉండే తన కొడుకు పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు విమాన టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించింది. అందుకోసం ఆన్లైన్లో ట్రావెల్ ఏజెంట్ కోసం వెతికింది.
"లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్" సంస్థ పేరిట ఆమెను సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.4,14,180 ఉంటుందని, డెబిట్ కార్డు వివరాలు చెప్పాలని రాజేష్ అనే అమెను ఏజెంట్ కోరాడు. నిజంగానే అతను ట్రావెల్స్ వ్యక్తి అని భావించిన అనిత.. డెబిట్ కార్డు వివరాలు ఇవ్వడంతో పాటు టికెట్ బుకింగ్ కోసం ఓటీపీ కూడా చెప్పింది.
దీంతో అకౌంట్ నుంచి క్లియర్ ట్రిప్ పేరిట డబ్బులు కట్ అయ్యాయి.చాలాసేపు అయినా టికెట్ బుకింగ్ వివరాలు రాకపోవడంతో యాక్టర్ అనిత షాక్ అయ్యారు. మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సదరు నిందితుడు ఎక్కడి నుంచి ఈ వ్యవహారం నడిపాడు అని సైబర్ నిపుణుల సాయం తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
