అంతర్జాతీయం

ఇండియా టు యూఎస్.. రాహుల్ దూకుడు! అంతర్జాతీయ వేదికల నుంచి ఎన్డీయేపై పోరు.. బీజేపీ ఎదురుదాడి

రాహుల్ తన రాజకీయ పోరాటాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. అమెరికా పర్యటనలోనూ ఓట్ చోరీ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కొలంబియా యూనివర్శిటీలో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. అటు బీజేపీ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది.

అంతర్జాతీయ వేదికలపైనా అదే దూకుడు

ఎన్డీయేపై రాహుల్ గాంధీ యుద్ధం

కొలంబియా యూనివర్శిటీలో రాహుల్ గళం

కాంగ్రెస్ పై బీజేపీ తీవ్ర విమర్శలు

భారత రాజకీయాలు ఇప్పుడు ఖండాలు దాటుతున్నాయి. అమెరికా వేదికలపై కూడా మన పార్టీల విమర్శలు.. ఆరోపణలే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వరుస విదేశీ పర్యటనలు, అక్కడ చేస్తున్న కామెంట్లు కాక పుట్టిస్తున్నాయి. మోదీ ప్రభుత్వ విధానాలపై దేశంలో విమర్శలు చేస్తున్న రాహుల్.. ఇప్పుడు అమెరికా వేదికగా కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని, నిరుద్యోగం తీవ్ర సమస్యగా మారిందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపాలున్నాయని నిప్పులు చెరుగుతున్నారు.

కొలంబియా వేదికగా మోదీ సర్కారుపై సమరం

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన ఇంటరాక్షన్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ భారీ ఆర్థిక సంక్షోభం అంచున ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, విద్యావ్యవస్థలోనూ లోతైన సమస్యలున్నాయని అన్నారు. దేశంలోని యువతకు భవిష్యత్తుపై భరోసా కనిపించడం లేదని, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన చదువుకున్న యువతలో అసంతృప్తి పెరుగుతోందని వివరించారు. ఉద్యోగాలు, అవకాశాలు, భవిష్యత్తుపై ఆశలు లేకపోవడమే యువతలో ఆందోళనకు కారణమని అభిప్రాయపడ్డారు.

అక్కడా.. ఓట్ చోరీ ఆరోపణలే

2024 ఎన్నికల సందర్భంగా మొదలైన ఓట్ చోరీ ఆరోపణలను రాహుల్ అమెరికాలోనూ వినిపించారు. దాదాపు 14 కోట్ల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం ఈ ఆరోపణలపై సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు జరగకుండా ప్రజాస్వామ్యం ఎలా బలపడుతుందని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా అన్నారు.

రాహుల్ అంతటితో ఆగలేదు. వ్యవస్థలోని కొందరు వ్యక్తులు తమతో మాట్లాడుతున్నారని, దేశంలో అసంతృప్తి పెరిగితే ప్రభుత్వం హింసకు దిగే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థి ఉద్యమాలు ప్రజల్లో భయాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ నుంచి ఈసీ వరకు.. యువత నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వరకు సంచలన ఆరోపణలే చేశారు రాహుల్.

దేశాన్ని అవమానిస్తారా..? రాహుల్ పై బీజేపీ ఫైర్

రాహుల్ కామెంట్లపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది బీజేపీ. విదేశీ వేదికలపై భారత్‌ను కించపరచడమే రాహుల్ పనిగా మారిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. రాహుల్‌ను ఏకంగా 'లీడర్ ఆఫ్ యాంటీ ఇండియా ప్రాపగాండా' అంటూ అభివర్ణించారు బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ.భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ గాంధీ సహజంగానే ద్వేషిస్తున్నారని, విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ దేశం గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు.

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు దేశ ప్రయోజనాలను, జాతీయ ప్రతిష్ఠను ముందుకు తీసుకెళ్తారని, రాహుల్ మాత్రం విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నారని ప్రదీప్ భండారీ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాహుల్ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

ఇండియా టూ యూఎస్.. రాహుల్ వ్యూహమేంటి?

ఇక్కడే కాంగ్రెస్ వ్యూహం ఆసక్తికరంగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ తన విమర్శలను కేవలం భారత రాజకీయ వేదికలకే పరిమితం చేయడం లేదు. విదేశీ విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ సమావేశాలు, NRIలతో జరిగే కార్యక్రమాలను కూడా తన రాజకీయ సందేశానికి వేదికలుగా మార్చుకుంటున్నారు.

ఇలాంటి వేదికల్లో నిరుద్యోగం, ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ, సామాజిక అసమానతలు వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా భారత రాజకీయ పరిణామాలపై అంతర్జాతీయ చర్చను ఆకర్షించే ప్రయత్నం కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యావేత్తలు, విద్యార్థులు, అంతర్జాతీయ మీడియా దృష్టిలో భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను ఉంచాలన్నది ఆయన వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్‌కు రెండు విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది. దేశంలో మోదీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం ఒకటైతే, భారత ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్షం లేవనెత్తుతున్న ప్రశ్నలను ప్రపంచ చర్చలోకి తీసుకెళ్లడం మరొకటి. అందుకే రాహుల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

రాహుల్ నెక్స్ట్ టార్గెట్ చికాగో యూనివర్శిటీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో విద్యార్థులు, ప్రొఫెసర్లతో ముఖాముఖి నిర్వహించిన ఆయన.. మరికొద్ది గంటల్లో చికాగో యూనివర్సిటీని కూడా సందర్శించనున్నారు. అంటే అమెరికాలోని మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ వేదికగా ఆయన ఏ అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి