పోలీసు శాఖలో గత కొంతకాలంగా ప్రమోషన్లకు సంబంధించిన అంశం హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నో ఏండ్లుగా ప్రమోషన్లకు నోచుకోని సీనియర్ పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో చాలా కాలంగా నిరాశతో ఉన్నవారికి ప్రమోషన్లు వస్తున్నాయని కొందరు సంతోషంగా ఉంటే మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.ఎందుకంటే తమ కంటే జూనియర్లకు పెద్ద పోస్టులు ఇస్తున్నారని, సీనియార్టీ ప్రకారం తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1991 బ్యాచ్ వారికి అన్యాయం?
పోలీసు శాఖలో పదోన్నతుల విషయంలో 1991 బ్యాచ్‌కు చెందిన పలువురు సీనియర్ డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్ దక్కకుండా పోతోందని, తమకన్నా జూనియర్లు 1992 బ్యాచ్ హైదరాబాద్ రేంజ్ అధికారులకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారని బాధిత అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన 18 మంది అధికారులకు ఎస్పీ స్థాయి ప్రమోషన్ రావాల్సి ఉండగా,అదే బ్యాచ్‌కు చెందిన మరో 11 మందికి అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ రాకుండా పోతుందని బాధిత అధికారులు ఆరోపిస్తున్నారు.
అయితే, 1991 బ్యాచ్ సీనియార్టీని కాదని 1995 బ్యాచ్‌కు చెందిన 28 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంలో సీనియారిటీ, అర్హతలు, ఖాళీల కేటాయింపు, రోస్టర్ విధానం వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ప్రమోషన్ల వివాదంలో జీవో నంబర్ 74 కీలకకంగా మారినట్టు సమాచారం. గతంలో సీనియార్టీ జాబితాల రూపకల్పనలో ఏర్పడిన వివాదాలు, కోర్టుల్లో కొనసాగిన కేసులు ఈ సమస్యను మరింత జఠిలం చేశాయి.ఉమ్మడి ఏపీలో నియామకాలు జరిగిన నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీనియారిటీ, జోన్లవారీ ఖాళీల కేటాయింపు అంశాలు వివాదానికి దారితీసినట్టు సమాచారం.
హైదరాబాద్ సిటీ లిమిట్స్, హైదరాబాద్ రేంజ్, వరంగల్ రేంజ్ అధికారుల మధ్య ఈ అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనట్టు సమాచారం. తమ కంటే జూనియర్లకు ప్రమోషన్లు కల్పించి సీనియర్లపై వారిని నియమించబోమని, అదేవిధంగా సీనియర్ అధికారులకు అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చిన డీజీపీ సీవీ ఆనంద్.. తాజాగా హైదరాబాద్ రేంజ్ 1992 బ్యాచ్‌కు చెందిన అదనపు ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీ లుగా పదోన్నతులు ఇస్తున్నారని ఆరోపించారు. 1991 బ్యాచ్‌కు చెందిన అదనపు ఎస్పీలకు మొండి చెయ్యి చూపించేందుకు రంగం సిద్ధం చేశారని, ఈ ప్రతిపాదనలను ఎలాంటి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెబుతున్నారు.


