- సీబీఐ మాజీ డైరెక్టర్ నుంచి మహిళా నేత వరకు..
- మాజీ నగర సీపీపై వరుసగా ప్రశ్నల వర్షం
- ఒక బదిలీ.. వందల ప్రశ్నలు
- సమస్య ముగిసిందనుకున్నారు.. కానీ అక్కడే మొదలైంది
- ‘స్వేచ్ఛ న్యూస్’ ముందు నుంచీ చెబుతుందిదే!
- సజ్జనార్ సార్.. జవాబు చెప్పాల్సిందే..
- ఆరోపణలకు సమాధానాలు రాకపోతే ప్రశ్నలు ఆగవు
- ఏదో ఒక రూపంలో గళం విప్పుతూనే ఉంటాయి
- మేం వార్తలు రాసింది వ్యక్తిగత కక్షతో కాదు
- మా ముందుకొచ్చిన సమాచారం, ఆరోపణలు, ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశాల ఆధారంగానే కథనాలు..
- ప్రశ్నించినందుకు కేసులు పెట్టినా, ఒత్తిళ్లు తీసుకొచ్చినా ‘మా కలం’ ఆగదు
- నిజానిజాలు తేలే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం
- న్యాయం జరిగే వరకు రాస్తూనే ఉంటాం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్
హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఈ పేరు ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు. వరుసగా ఆరోపణలు, అంతకు మించి విమర్శలు. అసలేం జరిగింది. ఏం జరుగుతోంది? స్వేచ్ఛ న్యూస్ ముందు నుంచీ చెబుతున్నదే నిజమైందా? మేం మాట్లాడింది.. మాట్లాడుతోందే నిజం కాబట్టి అదే జరిగింది. అదే జరిగి తీరుతుంది. ఎందుకంటే మేం నిజమే చెప్పాం. నిప్పులాంటి నిజాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేశాం. అదీ స్వేచ్ఛ న్యూస్ నైజం. వాస్తవానికి ఒక బదిలీతో వివాదం ముగిసిపోతుందనుకున్నారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పోలీస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. మరోవైపు మహిళా నేత జయంతి మట్టా తనకు ఎదురైన అనుభవాలను బయటపెడుతూ సజ్జనార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీస్ పోస్టింగుల నుంచి అక్రమాస్తుల వరకు, మహిళా అధికారులపై చర్యల నుంచి జర్నలిస్టుల అరెస్టుల వరకు ఒక్కొక్కటిగా బయటకొస్తున్న అంశాలెన్నో! మరి ఇవన్నీ కేవలం ఆరోపణలుగానే మిగిలిపోతాయా? విచారణ జరిగేదెప్పుడు? నిజాలు తేలేదెప్పుడు? ప్రశ్నించిన గొంతులను కేసులతో ఆపగలరా? ఈ వివాదం వెనుక ఉన్న పూర్తి కథేంటో చూద్దాం.
బదిలీతో కదిలిన తేనె తుట్టె.. తెరపైకి పాత వివాదాలు!
తెలంగాణ పోలీస్ వ్యవస్థలో వీసీ సజ్జనార్ గురించి తెలియని వారుండరు. ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేసుకోవడం, సోషల్ మీడియాలో నిరంతరం ఫోకస్లో ఉండటం, ప్రచారంలో ముందుండటం ఆయన స్టైల్. ‘దిశ’ ఎన్కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అధికారి. ఇప్పుడు అదే అధికారి చుట్టూ వివాదాలు, ఆరోపణలు, లెక్కలేనన్ని విమర్శలు. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ ఎపిసోడ్ ఎటు వెళ్తోంది? ఇంకా బయటకు రాని వారు ఎవరున్నారు? ఇంకెంత మంది తమ గళం విప్పుతారు? అనేవి ఆసక్తికరంగా మారాయి. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా నవంబర్ 12న తెలంగాణ ప్రభుత్వం సజ్జనార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ వెంటనే తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా నియమించింది. ఆయన స్థానంలో మహేష్ మురళీధర్ భగవత్ హైదరాబాద్ కొత్త సీపీగా బాధ్యతలు చేపట్టారు. అక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది. నిజంగానే ముగిసిందనుకుంటున్నారా? కానే కాదు, అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. సజ్జనార్ బదిలీ తర్వాత వరుసగా వెలుగులోకి వస్తున్న విమర్శలు, ఆరోపణలు ఈ వ్యవహారంపై ఆసక్తిని పెంచుతున్నాయి. బదిలీ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చేసిన ట్వీట్ ఈ మొత్తం వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. ఆయన మరెవరో కాదు మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు.
మాజీ సీబీఐ డైరెక్టర్ సెన్సేషనల్ ట్వీట్
సజ్జనార్ ట్రాన్స్ ఫర్పై నాగేశ్వరరావు స్పందించిన తీరు మామూలుగా లేదు. ఆయన సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు బహిరంగంగా ధన్యవాదాలు తెలిపారు.సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీ పదవి నుంచి తప్పించినందుకు కృతజ్ఞతలు చెబుతూ, ఆయన్ను ఉద్దేశించి ‘క్రిమినల్ ఇన్ యునిఫాం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన సహోద్యోగిని ఇలాంటి మాటలతో విమర్శించడం తనకు బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ ప్రజా ప్రయోజనాల కోసం నిజాన్ని చెప్పాల్సి వస్తోందని పేర్కొన్నారు. సర్వీస్‌లో సహచరుడనే రిలేషన్ కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.ఇంతటితో ఆగలేదు. ఒక అధికారిని మరో విభాగానికి బదిలీ చేయడం శిక్ష కాదని, బదిలీ చేసినంత మాత్రాన ఆరోపణలు తొలగిపోవని స్పష్టం చేశారు. సజ్జనార్‌పై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒక మాజీ సీబీఐ డైరెక్టర్, సుదీర్ఘ పోలీస్ అనుభవం ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, తన మాజీ సహోద్యోగిపై ఇంత తీవ్రంగా స్పందించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన లేవనెత్తిన అభ్యంతరాల వెనుక ఉన్న అంశాలేమిటి? ప్రభుత్వం వీటిపై విచారణకు సిద్ధమవుతుందా? నాగేశ్వరరావు గతంలోనూ సజ్జనార్ వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయకృష్ణారెడ్డి కేసు ఈ వివాదానికి ఒక నేపథ్యంగా నిలిచింది.
ఉదయకృష్ణారెడ్డి కేసులో ఏం జరిగింది?
నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళా అధికారిని వేధించారనే ఆరోపణలతో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో హైదరాబాద్ పోలీసులు వ్యవహరించిన తీరుపై నాగేశ్వరరావు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఉదయ్ కృష్ణారెడ్డికి అన్యాయం జరిగిందనే వాదనతో పాటు, కస్టడీలో వ్యవహరించిన తీరుపైనా ప్రశ్నలు లేవనెత్తారు. కస్టడీలో అమానవీయంగా వ్యవహరించారనే ఆరోపణలు, ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారనే అంశాలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 9న తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు నాగేశ్వరరావు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. కేసును సీబీ సీఐడీకి అప్పగించి దర్యాప్తు చేయాలని సూచించారు. సజ్జనార్ బదిలీ తర్వాత మరోసారి నాగేశ్వరరావు బహిరంగంగా స్పందించారు. ఆయన ట్వీట్‌కు సజ్జనార్ నుంచి బహిరంగ సమాధానం కనిపించలేదు. ఆరోపణలు అవాస్తవమైతే ఆధారాలతో ఖండించవచ్చు కదా? సమగ్ర విచారణ కోరుతున్న మాజీ సీబీఐ డైరెక్టర్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఒక సీనియర్ అధికారి నుంచి వచ్చిన ఈ స్థాయి విమర్శలను సాధారణ సోషల్ మీడియా కామెంట్‌గా తీసిపారేయలేం. అందుకే ఈ ట్వీట్ ఇప్పుడు సజ్జనార్ వివాదంలో అత్యంత కీలకంగా మారింది.
రాజాసింగ్ లేఖతో మరింత వేడి
ఈ ఎపిసోడ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎమ్మెల్యే రాజాసింగ్. ఈయన సజ్జనార్‌పై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సజ్జనార్ గతంలో నిర్వహించిన బాధ్యతలు, ఆయన హయాంలో జరిగిన కీలక కేసుల దర్యాప్తుపై సీబీఐ లేదా న్యాయ విచారణ జరిపించాలని కోరారు. గోల్డ్ చోరీ కేసు, ఆమ్వే కేసుల్లో దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయా? నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఎంక్వైరీలో ఆలస్యానికి కారణాలేమిటి? ఏమైనా అంశాలను తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయా? అనే ప్రశ్నలను లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా రాజాసింగ్ ప్రశ్నలు లేవనెత్తారు. సజ్జనార్ హయాంలో ఈ కేసు దర్యాప్తు ఏ దిశలో సాగింది? సీనియర్ పోలీస్ అధికారుల పాత్రపై వచ్చిన ఆరోపణలను ఎలా పరిశీలించారు? అనే అంశాలపై స్వతంత్ర విచారణ జరగాలని కోరారు. ఇక కర్ణాటకలో సజ్జనార్ స్వగ్రామంలో సుమారు 100 ఎకరాల భూములు కొనుగోలు చేశారనే ప్రచారంపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ భూముల కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదాయానికి, ఆస్తులకు మధ్య పొంతన ఉందా? అనే అంశాలను తేల్చాలని ముఖ్యమంత్రిని కోరారు.
మహిళా నేత తీవ్ర ఆరోపణలు
ఈ సమయంలోనే బీసీ మహిళా జేఏసీ అధ్యక్షురాలు జయంతి మట్టా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీ బాధ్యతల నుంచి తప్పించడంతోనే సరిపెట్టకూడదని, ఆయన్ను పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. బదిలీ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం మరో విభాగానికి ట్రాన్స్ ఫర్ చేయడం వల్ల ప్రయోజనమేంటని కూడా ఆమె ప్రశ్నించారు. సజ్జనార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన అక్రమాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర హోంశాఖ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఎస్ఐ, సీఐ, ఏసీపీ, డీసీపీ స్థాయి పోస్టింగుల్లో భారీగా వసూళ్లు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సజ్జనార్ ఆస్తుల లెక్కలు తేలిస్తే తెలంగాణలో సగం సమస్యలు పరిష్కారమవుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరవీల ద్వారానే ఆయన తిరిగి కీలక పోస్టింగ్ తెచ్చుకున్నారని కూడా జయంతి ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆమె చెప్పిన మరో విషయం ఆసక్తికరంగా మారింది. గత ఐదేళ్లుగా సజ్జనార్ కీలక పోస్టుల్లో లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్నామని, తిరిగి హైదరాబాద్ సీపీగా రావడంతో సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆందోళన చెందానని చెప్పారు. ఈ నెల 2న తిరుపతికి వెళ్లినప్పుడు సజ్జనార్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రతి మెట్టునూ మొక్కుకున్నానని, వారం పది రోజుల్లోనే తన కోరిక నెరవేరిందని జయంతి మట్టా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
స్వేచ్ఛ కథనాల్లో బయటకొచ్చిన కీలక అంశాలివే!
ఇక్కడే మేం రాసిన వార్తల సత్తా ఏంటో సమాజానికి అర్థమైంది. స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ప్రస్తావన చర్చనీయాంశంగా మారింది. సజ్జనార్ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలను మొదటి నుంచీ లోతుగా పరిశీలిస్తూ మేం వరుస కథనాలను ప్రచురించాం. కేవలం బదిలీ వార్తతో సరిపెట్టకుండా, పోలీస్ వ్యవస్థలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న పరిణామాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ముఖ్యంగా పోస్టింగుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.
రూ.25 లక్షల జూబ్లీహిల్స్ పోస్టింగ్ ఆరోపణ!
నవంబర్ 13న ప్రచురించిన కథనంలో అమీన్పూర్ సీఐ శ్రీనివాసులు రెడ్డి వ్యవహారాన్ని ప్రస్తావించాం. ఒక మహిళ తన భర్త వేధింపులపై పోలీసులను ఆశ్రయించినప్పుడు, సదరు సీఐ ఆమెను లొంగదీసుకుని అబార్షన్లు చేయించారని చెప్పాం. విషయం తెలిసినా సజ్జనార్ ఆయన కింది స్థాయి అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాం. అలాగే, సదరు సీఐపై లైంగిక ఆరోపణలు ఉన్నప్పటికీ, ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి సైఫాబాద్ స్టేషన్‌కు ఎస్హెచ్ఓగా బదిలీ చేశారని కూడా గుర్తుచేశాం. కేవలం 20 రోజుల్లోనే మరో కీలక పోలీస్ స్టేషన్‌కు పోస్టింగ్ ఎలా ఇచ్చారు? అనే ప్రశ్నలు సంధించాం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోస్టింగ్ కోసం రూ.25 లక్షలు చేతులు మారాయనే విషయాన్ని బాధిత మహిళ డీజీపీకి, ముఖ్యమంత్రికి వాట్సప్ ద్వారా తెలియజేశారు. ఈ విషయాన్ని కూడా మేం చెప్పాం.
బినామీ టీమ్స్.. కీలక పోస్టింగుల వెనుక ఎవరు?
సజ్జనార్‌కు సన్నిహితంగా ఉన్న సిబ్బందికి కీలక పోస్టింగులు ఇచ్చారా? ఒక్కో బదిలీ వెనుక ఎవరెవరి పాత్ర ఉంది? ఒక్కో ట్రాన్స్‌ఫర్‌కు ఎన్ని లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అనే ప్రశ్నలను కూడా స్వేచ్ఛ కథనాలు లేవనెత్తాయి. మహిళలకు అండగా ఉంటామని ప్రచారం చేసుకునే పోలీస్ వ్యవస్థలోనే ఒక మహిళ ఫిర్యాదు చేసినప్పుడు న్యాయం జరగకపోతే సామాన్య మహిళలు ఎవరిని ఆశ్రయించాలి? ఇక్కడే స్వేచ్ఛ ఛైర్మన్ దేవందర్ రెడ్డి పోరాటం కనిపిస్తోంది.
దిశ ఎన్కౌంటర్.. పేరు ఒకరికి, కేసులు మరొకరికి?
సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగడానికి కారణమైన దిశ ఎన్కౌంటర్ వ్యవహారంపైనా స్వేచ్ఛ ప్రశ్నలు లేవనెత్తింది. ఆ కేసులో జరిగిన ఎన్‌కౌంటర్‌ను సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ బూటకపు ఎన్‌కౌంటర్‌గా నిర్ధారించిందని స్వేచ్ఛ కథనం ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో పది మంది పోలీస్ అధికారులపై హత్య కేసులు నమోదయ్యాయని, న్యాయ ప్రక్రియ కొనసాగుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్కౌంటర్ తర్వాత వచ్చిన పేరు, ప్రచారం ఒక అధికారికి దక్కితే, ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న కింది స్థాయి సిబ్బంది న్యాయపరమైన చిక్కుల్లో పడినప్పుడు వారి పరిస్థితిని ఎవరు పట్టించుకోవాలి? అధికారుల ఆదేశాలను అమలు చేసిన సిబ్బందికి బాధ్యతను వదిలేసి, ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోకుండా ఉండాలా? ఇదెక్కడి న్యాయం? మేం ప్రశ్నించింది ఇదే.
జర్నలిస్టుల అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులా?
సజ్జనార్ సమాధానాలు చెప్పరు. ప్రశ్నిస్తే బెదిరిస్తారు. లేదా అరెస్టులు చేస్తామని వార్నింగులు ఇప్పిస్తుంటారు. వరంగల్ యాసిడ్ దాడి సమయంలో రిపోర్టింగ్ చేసిన జర్నలిస్ట్ దొంతి రమేష్‌ను రాత్రికి రాత్రి తీసుకెళ్లి అరెస్ట్ చేసింది నిజం కాదా? సోషల్ మీడియా జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి బెదిరించింది వాస్తవం కాదా? అనేక మందిని రిమాండ్‌కు పంపించే ప్రయత్నాలు జరగలేదా? ఎన్నో ఫిర్యాదులు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయని సందర్భాలున్నాయనే విషయం వాస్తవమా కాదా? ముందు నుంచీ మేం చెబుతుందిదే. ఒక మాజీ సీబీఐ డైరెక్టర్ బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలోనే డీజీపీకి లేఖ రాసి స్వతంత్ర విచారణ కోరారు. ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఒక మహిళా నేత తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ అక్రమాస్తులపై విచారణ కోరారు. మరోవైపు స్వేచ్ఛ న్యూస్ వరుస కథనాలతో పోలీస్ పోస్టింగులు, కీలక కేసులు, మహిళల ఫిర్యాదులు, జర్నలిస్టుల అరెస్టులపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పుడు అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? ఒక ఆరోపణకు సమాధానం చెప్పకుండా మరో కేసు పెట్టడం వల్ల సమస్య పరిష్కారమవుతుందా? ప్రశ్నించిన గొంతును ఆపితే ప్రశ్నే చనిపోతుందా? ఆరోపణలు అవాస్తవాలైతే ఆధారాలతో ఖండించాలి. నిజమైతే చర్యలు తీసుకోవాలి. అంతేతప్ప ప్రశ్నలనే సమస్యగా చూడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజల శాంతి భద్రతల కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే పోలీస్ అధికారులకు అస్సలు శ్రేయస్కరం కాదు.
స్వేచ్ఛ న్యూస్ కథనాల ఉద్దేశం కూడా ఇదే..
ఒక వ్యక్తిని ముందుగానే దోషిగా తేల్చడం కాదు. అధికారంలో ఉన్నవారు ఎవరైనా సరే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పోలీస్ వ్యవస్థలో అవినీతి, అక్రమాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తే వాటిని విచారించాలి. బాధితులకు న్యాయం జరగాలి. తప్పు చేసినవారు ఎవరైనా చట్టం ముందు నిలబడాలి. నిజం నిప్పులాంటిది. దాన్ని కొంతకాలం కప్పిపుచ్చవచ్చేమో కానీ ఆర్పేయడం ఎవరి వల్లా కాదు. బదిలీతో పదవి మారవచ్చు. కానీ ఆరోపణలకు సమాధానాలు రాకపోతే ప్రశ్నలు ఆగవు. ఏదో ఒక రూపంలో గళం విప్పుతూనే ఉంటాయి. మేం వార్తలు రాసింది వ్యక్తిగత కక్షతో కాదు. మా ముందుకొచ్చిన సమాచారం, ఆరోపణలు, ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశాల ఆధారంగానే కథనాలు ప్రచురించాం. ప్రశ్నించినందుకు కేసులు పెట్టినా, ఒత్తిళ్లు తీసుకొచ్చినా మా కలం ఆగదు. నిజానిజాలు తేలే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. న్యాయం జరిగే వరకు రాస్తూనే ఉంటాం. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు. పదవులు శాశ్వతం కాదు. కానీ ప్రజలకు న్యాయం జరగాలనే ఆకాంక్ష మాత్రం శాశ్వతం. అదే మా దారి. అదే మా లక్ష్యం.


