Indiramma Towers: హైదరాబాద్‌లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా)లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ప్రాజెక్టు తొలిసారిగా రెరాలో నమోదవడం విశేషం.
రెరా రిజిస్ట్రేషన్‌తో లబ్ధిదారులకు మరింత భరోసా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని పారదర్శకంగా చేపట్టడంతో పాటు, లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల అప్పగింత వరకు ప్రతి దశలో జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. రెరా రిజిస్ట్రేషన్‌తో లబ్ధిదారులకు మరింత భరోసా కలగనుంది. నిర్మాణంలో జాప్యం జరిగినా, నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నా రెరాను ఆశ్రయించి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు.
60 లక్షలు విలువ చేసే ప్లాట్ 6లక్షలకే
శంకుస్థాపన జరిగిన ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తామని ప్రకటించారు. లబ్దిదారులకు ఉచితంగా స్థలంతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్ లో రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు విలువ చేసే ప్లాట్లను 6లక్షలకే అందిస్తున్నామన్నారు. కాగా, హైదరాబాద్ పరిధిలోని ఓఆర్ఆర్ వద్ద సుమారు లక్ష ఇందిరమ్మ ప్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి దశలో మలక్ పేట, కుత్బుల్లాపూర్ లోని ఇందిరమ్మ టవర్లకు టీజీ రెరా నుంచి అనుమతులు లభించాయి.
క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్లు
క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తోంది. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కో నియోజకవర్గంలో 4 టవర్ల చొప్పున, ఒక్కో టవర్ లో 120 ప్లాట్లు కలిపి మొత్తం 480 ప్లాట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో ప్లాట్ ఖర్చు 11 లక్షల రూపాయలు. ఇందులో 5 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోంది. మిగతా 6 లక్షల రూపాయలు లబ్దిదారులు విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన ఏడాదిలోపు టవర్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని బిల్డర్లను ఆదేశించింది.
