TG: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో ఉన్న ఫేస్బుక్ మాతృసంస్థ 'మెటా' ఆఫీస్ పై వద్ద జరిగిన ఘటనపై స్థానిక సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఐటీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేషనల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను, ఇంఛార్జి మణిశర్మల ఫేస్బుక్ అకౌంట్లను సస్పెండ్ చేశారన్న కారణంతో, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు మెటా కార్యాలయంపై దాడి చేసి అరాచకం సృష్టించారని ఐటీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నిపుణుల అసహనం
ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ సంస్థల కార్యాలయాలపై ఇలాంటి దాడులు జరగడంపై ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఐటీ ఉద్యోగులు మాట్లాడుతూ.. ఒకవైపు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటే, మరోవైపు అధికార పార్టీ అనుబంధ సంఘాల నేతలే ఉన్న కంపెనీలను భయపెట్టేలా వ్యవహరించడం సరికాదని అన్నాయి. ఇలాంటి ఘటనల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని, కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే అంతర్జాతీయ కంపెనీలు వెనకడుగు వేసే ప్రమాదం ఉందని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లా అండ్ ఆర్డర్‌పై విమర్శలు
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఐటీ సంస్థలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన అధికార పార్టీ నాయకులే స్వయంగా దాడులకు దిగడం సబబేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల నిలిపివేతపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాల్లో లేదా ఆయా సంస్థల రూల్స్ ప్రకారం పరిష్కరించుకోవాలి తప్ప, నేరుగా కార్యాలయాలపై దాడులకు దిగడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, తమ జాతీయ నేతల ఖాతాలను అకారణంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూనే తాము ఆందోళన చేపట్టినట్లు యూత్ కాంగ్రెస్ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.
