తెలంగాణ

Flight Cancellations: విమాన ప్రయాణికులకు షాక్.. పీక్ సీజన్‌లో 7,154 సర్వీసులకు కోత! అసలు కారణమేంటో తెలుసా?

Flight Cancellations: ఇయర్ ఎండింగ్ సెలవులు, పెళ్లిళ్ల ముహూర్తాలు, పండగలతో సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో విమాన ప్రయాణాలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఎయిర్‌పోర్టులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతూ, టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి.

Flight Cancellations: ఇయర్ ఎండింగ్ సెలవులు, పెళ్లిళ్ల ముహూర్తాలు, పండగలతో సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో విమాన ప్రయాణాలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఎయిర్‌పోర్టులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతూ, టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. కానీ ఈసారి మాత్రం సీన్ పూర్తిగా తలకిందులైంది. 2022 తర్వాత మొదటిసారిగా ఈ రద్దీ సీజన్‌లో దేశీయ విమాన సర్వీసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ ‘సిరియం’ విడుదల చేసిన తాజా గణాంకాలు ప్రయాణికులతో పాటు విమానయాన వర్గాలనూ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఏకంగా 7,154 విమానాలకు బ్రేక్!

గత ఏడాదితో పోలిస్తే ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశీయ విమానయాన సంస్థలు మొత్తం 7,154 సర్వీసులను కుదించాయి. అంటే సగటున రోజుకు 117 విమానాలు రద్దవుతున్నాయన్నమాట. ఈ రెండు నెలల్లో కలిపి మొత్తం 95,774 సర్వీసులు మాత్రమే నడవనున్నాయి, ఇది గతేడాది కంటే 3.5 శాతం తక్కువ. ఇవి కేవలం ముందస్తు షెడ్యూల్ లెక్కలు మాత్రమే. సాంకేతిక కారణాలు, నిర్వహణ లోపాలతో చివరి నిమిషంలో రద్దయ్యే విమానాలను కూడా కలుపుకుంటే ఈ కోతల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ఏ సంస్థ ఎన్ని సర్వీసులు తగ్గించింది?

ఈ సర్వీసుల కోత ప్రభావం ప్రధానంగా ఎయిర్ ఇండియా గ్రూప్, స్పైస్ జెట్ సంస్థలపై ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న స్పైస్ జెట్ తన సర్వీసులను ఏకంగా 25.3 శాతం తగ్గించుకొని 6,357 విమానాలకే పరిమితమైంది. ఎయిర్ ఇండియా విషయానికి వస్తే 15.9 శాతం కోతతో 27,090 సర్వీసులను నడుపుతుండగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 5.2 శాతం తగ్గించుకొని 22,080 విమానాలకు పరిమితమైంది. దేశీయ అతిపెద్ద విమాన సంస్థ ఇండిగో సైతం 1.7 శాతం సర్వీసులను తగ్గించి 19,425 విమానాలను నడుపుతోంది. మిగతా సంస్థలన్నీ కోతలు విధిస్తుంటే, ఆకాశ ఎయిర్ మాత్రం భిన్నంగా తన సర్వీసులను 46.9 శాతం పెంచుకొని 12,061 విమానాలతో దూసుకుపోతోంది.

విమానాలు తగ్గినా సీట్లు తగ్గలేదు..

విమానాల సంఖ్యలో 3.5 శాతం కోత పడినప్పటికీ, మొత్తం సీట్ల సామర్థ్యంలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. సీట్ల సామర్థ్యం కేవలం 0.5 శాతం మాత్రమే తగ్గి 3.55 కోట్లుగా నమోదైంది. దీనికి కారణం ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న కొత్త వ్యూహమే. ముఖ్యంగా ఇండిగో వంటి సంస్థలు తక్కువ సర్వీసులను నడుపుతూనే, ఎక్కువ మంది ప్రయాణించే పెద్ద విమానాలను రంగంలోకి దించాయి. దీనివల్ల ఇండిగో విమానాల సంఖ్య తగ్గినా సీట్ల సామర్థ్యం 1.4 శాతం పెరగడం గమనార్హం. కేవలం డిమాండ్ ఎక్కువగా ఉండే లాభదాయకమైన రూట్లపైనే సంస్థలు ఫోకస్ పెట్టాయి.

పీక్ సీజన్‌లో కోతలకు అసలు కారణాలివే!

డిమాండ్ ఉన్న సమయంలో విమాన సంస్థలు వెనకడుగు వేయడం వెనుక బలమైన ఆర్థిక కారణాలు దాగి ఉన్నాయి. విమాన నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 40 శాతం వాటా ఇంధనానిదే ఉంటుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం వల్ల విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు రూపాయి విలువ పతనం కావడం సంస్థలకు పెద్ద దెబ్బగా మారింది. విమానాల లీజులు, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ చెల్లింపులన్నీ డాలర్లలోనే చేయాల్సి రావడంతో ఆర్థిక భారం తడిసి మోపెడవుతోంది.

పెరిగిన ఖర్చులను తట్టుకునేందుకు సంస్థలు టికెట్ ధరలు, ఫ్యూయల్ సర్‌చార్జీలను పెంచాయి. కానీ ఛార్జీలు మరీ ఎక్కువైతే ప్రయాణికులు విమాన ప్రయాణాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య దేశీయ ప్రయాణికుల రద్దీ 1.9 శాతం తగ్గి 7.86 కోట్లకు పరిమితం కాగా, ఒక్క సెప్టెంబర్ నెలలోనే 6.5 శాతం క్షీణత నమోదైంది. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే భారత విమానయాన రంగం మరిన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని రేటింగ్ ఏజెన్సీ 'ఇక్రా' సైతం హెచ్చరించింది.

తర్వాత చదవండి