అభిప్రాయం

Outsourcing Employs: ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా నిలవండి- పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు JAC విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్, కార్ డ్రైవర్ మొదలుకొని కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ సిబ్బంది వరకు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాల విషయంలో మాత్రం తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు.

Outsourcing Employs: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్, కార్ డ్రైవర్ మొదలుకొని కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ సిబ్బంది వరకు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాల విషయంలో మాత్రం తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు.

ఒకవైపు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు, మరోవైపు కుటుంబ పోషణకు సరిపోని అరకొర జీతాలు.. ఇంకోవైపు అధికారుల వేధింపులు, ఉద్యోగ భద్రత లేకపోవడం, వేతనాల చెల్లింపుల్లో జాప్యం వంటి సమస్యలతో వేలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా.. మరికొందరు అనారోగ్యం, పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కార్మిక లోకాన్ని కలచివేస్తున్నాయి.

కార్మికులు చనిపోతున్నా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించకపోవడం అత్యంత బాధాకరం. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులపై కూడా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుస్తున్న ప్రతి అభ్యర్థికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల JAC హృదయపూర్వక విజ్ఞప్తి చేసింది.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల JAC ప్రధాన విజ్ఞప్తులు

1. సమాన పనికి సమాన వేతనం:

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం సూత్రం ప్రకారం న్యాయం జరిగేలా మద్దతు ప్రకటించాలి.

2. గౌరవప్రదమైన వేతనాలు:

పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా కుటుంబ పోషణకు సరిపడే గౌరవప్రదమైన వేతనాలు అందేలా కృషి చేయాలి.

3. ఉద్యోగ భద్రత:

ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే విధానానికి మద్దతు తెలపండి. అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగింపులు జరగకుండా రక్షణ కల్పించండి.

4. ఏజెన్సీ వ్యవస్థ రద్దు-ప్రభుత్వమే నేరుగా వేతనాల చెల్లింపు:

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను ఆసరాగా చేసుకుని మధ్యవర్తి ఏజెన్సీలు సాగిస్తున్న దోపిడీకి శాశ్వతంగా ముగింపు పలకాలి. ఏజెన్సీ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించి, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు చెల్లించే విధానాన్ని తీసుకురావాలి. PF, ESI వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా ఎలాంటి కోతలు, జాప్యాలు లేకుండా ఉద్యోగులకు అందేలా చర్యలు తీసుకోవడానికి మీ మద్దతు ప్రకటించండి.

5. అధికారుల వేధింపుల నుంచి రక్షణ:

పని ప్రదేశాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న అధికారుల వేధింపులు, అనవసర పని ఒత్తిళ్లను నివారించేందుకు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు మద్దతు ఇవ్వండి.

6. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు భరోసా:

విధి నిర్వహణలో లేదా ఉద్యోగ సంబంధిత పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు తగిన ఆర్థిక పరిహారం, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించే విధానానికి మద్దతు ప్రకటించండి.

7. శాసనమండలిలో కార్మికుల గొంతుక:

తెలంగాణ రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయండి.

ఎమ్మెల్సీ అభ్యర్థులకు ప్రత్యేక విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలోని పట్టభద్రుల సమస్యలతో పాటు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవన సమస్యలను కూడా మీ ఎన్నికల ప్రాధాన్యతల్లో చేర్చాలని కోరుతున్నాం.

ఈ అంశాలపై ప్రతి అభ్యర్థి తమ స్పష్టమైన అభిప్రాయాన్ని, విధానపరమైన వైఖరిని బహిరంగంగా ప్రకటించడంతో పాటు, సాధ్యమైన కార్యాచరణను లిఖితపూర్వకంగా తెలియజేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది.

ఎన్నికల ప్రచారానికే పరిమితం కాకుండా, ఎన్నికల అనంతరం కూడా కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని ఆశిస్తున్నాం. మాకు కావాల్సింది ఎవరి సానుభూతి కాదు, మా శ్రమకు తగిన వేతనం, మా కుటుంబాలకు భద్రత, మా జీవితాలకు గౌరవం! ఏజెన్సీలు వద్దు- మధ్యవర్తులు వద్దు-ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి!

తెలంగాణ రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కన్నీళ్లను తుడిచే దిశగా ప్రతి ఎమ్మెల్సీ అభ్యర్థి సానుకూలంగా స్పందించి, తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.

అన్నెం శ్రీనివాసరెడ్డి

వర్కింగ్ ప్రెసిడెంట్,

గ్రేటర్ హైదరాబాద్,

తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల JAC.

తర్వాత చదవండి