Gadget Price Hike: కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్న వారికి మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘టెక్ఆర్క్’ భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన మెమరీ చిప్స్ కొరత కారణంగా 2027లో గ్యాడ్జెట్స్ ధరలు ఆకాశాన్ని తాకనున్నాయని తాజా నివేదికలో వెల్లడించింది. కొత్త ఏడాదిలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరగనుండటంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న ధరలు..
నిజానికి గ్యాడ్జెట్స్ ధరల బాదుడు గడిచిన ఏడాది కాలంలోనే మొదలైంది. టెక్ఆర్క్ రిపోర్ట్ ప్రకారం.. భారత్‌లో గత ఏడాది కాలంలోనే స్మార్ట్‌ఫోన్ల ధరలు సగటున 16.6 శాతం, ల్యాప్‌టాప్‌ల ధరలు 13.5 శాతం మేర పెరిగాయి. అయితే మెమరీ చిప్స్ కొరత ఇప్పట్లో తీరే పరిస్థితి లేకపోవడంతో, 2027లో కంపెనీలు ఉత్పత్తి భారాన్ని నేరుగా కస్టమర్లపైనే వేయనున్నాయి. కేవలం ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మాత్రమే కాకుండా.. ఇళ్లలో నిత్యం వాడే స్మార్ట్ టీవీలు, సెక్యూరిటీ కెమెరాలు, వైఫై రూటర్ల ధరలు కూడా 2027లో భారీగా పెరగనున్నాయి.
ఇయర్ బడ్స్, ఎయిర్ ప్యూరిఫయర్ల ధరలు తగ్గాయి..
ఒకవైపు ఫోన్లు, టీవీల ధరలు భయపెడుతుంటే.. మరోవైపు కొన్ని స్మార్ట్ గాడ్జెట్ల ధరలు తగ్గడం యూజర్స్‌కు కాస్త ఊరటనిచ్చే విషయం. గడిచిన ఏడాది కాలంలో వైర్‌లెస్ ఇయర్ బడ్స్, రోబో వాక్యూమ్ క్లీనర్లు, ఎయిర్ ప్యూరిఫయర్ల ధరలు గణనీయంగా తగ్గినట్లు టెక్ఆర్క్ పేర్కొంది. మొత్తానికి 2027లో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. కొత్త ఫోన్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారు కొత్త ఏడాది వరకు ఆగకుండా ఇప్పుడే కొనుగోలు చేయడం బెటర్ అని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
