TG: బీరువాలో దాచిన స్వెటర్లు, రగ్గులు బయటకు తీయాల్సిన టైం వచ్చేసింది. తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే ఉదయం, రాత్రి వేళల్లో వీస్తున్న చలి గాలులకు జనం గజగజ వణికిపోతుండగా.. వాతావరణ శాఖ తాజాగా మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొనడంతో, రాబోయే మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.
ఆసిఫాబాద్‌లో 14 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత..
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలో 14.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిళ్లు చలి దారుణంగా పడిపోతుండటంతో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలి మంటలు వేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. అటు హైదరాబాద్‌లోనూ సాయంత్రం 6 దాటిందంటే చాలు చలి గాలులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండటంతో బైక్‌లపై వెళ్లేవారు, పొద్దున్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డిసెంబర్ 5 వరకు ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త
కేవలం ఈ మూడు రోజులే కాదు, డిసెంబర్ 5 వరకు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని, రాత్రి వేళల్లో స్వెటర్లు, మఫ్లర్లు లేకుండా బయటకు రావొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
