TG: ఆనాడు గులాబీ జెండా ఎగరకపోతే అసలు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ, చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవే ఉండేది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తా వేదికగా జరిగిన ‘దీక్షా దివస్’ స్ఫూర్తి బహిరంగ సభలో ఆయన పాల్గొని అధికార కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను తక్కువ చేసి చూపే ప్రయత్నాలపై కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ కథలో హీరో కేసీఆర్.. విలన్ కాంగ్రెస్!
తెలంగాణ సాధన ఒక పద్మవ్యూహమని, అర్జునుడు, కృష్ణుడు తరహాలో కేసీఆర్ దాన్ని ఛేదించి రాష్ట్రాన్ని సాధించారని కేటీఆర్ కొనియాడారు. "రథం నడిపింది కేసీఆర్, రణం చేసింది కేసీఆర్. తెలంగాణ కథలో హీరో కేసీఆర్ అయితే, విలన్ మాత్రం కాంగ్రెస్ పార్టీనే. 1956లో ఉన్న తెలంగాణను ఏపీలో కలిపిందే కాంగ్రెస్. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల వల్లే రాష్ట్ర ఏర్పాటు 60 ఏళ్లు ఆలస్యమైంది" అని ఆయన మండిపడ్డారు. 32 పార్టీలను ఒప్పించి, కేంద్రం మెడలు వంచి యాచించి కాదు శాసించి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు.
కాళేశ్వరంపై కక్ష.. పాలమూరుపై పగ!
ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. "కేసీఆర్పై కోపంతో తెలంగాణ సోయి లేని పాలకులు జీవనాడి కాళేశ్వరంపై కక్ష గట్టారు.. పాలమూరుపై పగబట్టారు. ద్రోహుల చేతుల్లో పడి తెలంగాణ మళ్లీ ఆగం అవుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు గాలికి అన్నట్లుగా పరిస్థితి మారింది" అంటూ విమర్శించారు. ఉద్యోగులు, విద్యార్థులతో బీఆర్ఎస్కు ఉన్నది పేగుబంధమని, యువత గర్జించి రాహుల్ గాంధీని నిలదీసే రోజు మళ్లీ వచ్చిందని పిలుపునిచ్చారు.
ఢిల్లీకి గులాంలుగా ఉందామా.. గులాబీలను పంపుదామా?
బీజేపీపైనా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడుపులో విషం లేకపోతే ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటును ఎలా కించపరుస్తారని ప్రశ్నించారు. మోడీ తెలంగాణకు ప్రధానమంత్రి కాదా అని నిలదీశారు. ఇక 2009లో కేసీఆర్ దీక్షకు బయలుదేరినప్పుడు ఇదే అలుగునూరు వద్ద పోలీసులు అడ్డుకున్న ఘటనను, 'బ్రెయిన్ డెడ్' అవుతుందని వైద్యులు హెచ్చరించినా 11 రోజుల పాటు మొండి పట్టుదలతో దీక్ష చేసిన తీరును కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. చివర్లో.. "మనం ఢిల్లీకి గులాంలుగా ఉందామా.. లేక మన గొంతుక వినిపించడానికి ఢిల్లీకి గులాబీలను పంపుదామా?" అంటూ ప్రజలను ఆలోచింపజేశారు.
