తెలంగాణ

Real Estate: మధ్యతరగతి హ్యాండ్స్ అప్.. ఆకాశాన్నంటిన ధరలతో ఆగిపోయిన హైదరాబాద్ రియల్ బండి!

Real Estate: ఏ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కైనా అసలైన మహారాజ పోషకులు మధ్యతరగతి ప్రజలే. ఒకప్పుడు ప్రతి మధ్యతరగతి కుటుంబ లక్ష్యాల్లో సొంతింటి కలకు పెద్ద పీట ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీసుకెళ్లిన ఆకాశాన్నంటిన ధరలు చూసి సామాన్యులే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా సొంతింటికి కలకు దూరంగా జరుగుతున్నారు.

Real Estate: ఏ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కైనా అసలైన మహారాజ పోషకులు మధ్యతరగతి ప్రజలే. ఒకప్పుడు ప్రతి మధ్యతరగతి కుటుంబ లక్ష్యాల్లో సొంతింటి కలకు పెద్ద పీట ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీసుకెళ్లిన ఆకాశాన్నంటిన ధరలు చూసి సామాన్యులే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా సొంతింటికి కలకు దూరంగా జరుగుతున్నారు. కొనుగోలుదారుల ఆదాయానికి, మార్కెట్లో ఉన్న రేట్లకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో 2021 నుంచి మొదలైన రియల్ స్తబ్దత ఇప్పటికీ కొనసాగుతూ, హైదరాబాద్ రియల్ బండికి పూర్తిగా బ్రేకులు వేసిందని చెబుతున్నారు.

లక్షన్నర ఈఎంఐ కట్టినా అసలు తీరేది రూ. 5 వేలే!

ప్రస్తుత మార్కెట్ లెక్కలు చూస్తే సామాన్యుడికి గుండె ఆగినంత పనవుతోంది. హైదరాబాద్‌లో 2,000 చదరపు అడుగుల (SFT) ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ. 2 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో రూ. 50 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి, మిగిలిన రూ. 1.5 కోట్లకు బ్యాంకు లోన్ తీసుకుంటే నెలకు కనీసం రూ. 1.5 లక్షల వరకు ఈఎంఐ పడుతోంది. ఈ మొత్తంలో దాదాపు రూ. 1.45 లక్షలు కేవలం వడ్డీకే పోతుండగా, అసలు తీరేది కేవలం రూ. 5 వేలు మాత్రమే. ఓవైపు పెరగని జీతాలు, మరోవైపు ఐటీ సహా వివిధ రంగాల్లో ఉద్యోగ అస్థిరత నేపథ్యంలో ఇంతటి ఆర్థిక భారాన్ని మోయడం తమ వల్ల కాదని మధ్యతరగతి ముందే చేతులెత్తేస్తోంది. దీంతో నేల విడిచి సాము చేయడం కంటే అద్దె ఇంట్లో ఉండటమే ఉత్తమమని భావిస్తూ, కనీసం ఎంక్వైరీలు చేయడానికి కూడా వెనుకడుగు వేస్తున్నారు.

ఖాళీగా 2 లక్షల ఫ్లాట్లు.. బిల్డర్లకు రక్తకన్నీరు!

గతంలో రియల్ బూమ్ బాగుందనే అతి ఆశతో కొందరు బిల్డర్లు కస్టమర్ల కొనుగోలు శక్తిని అంచనా వేయకుండా ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. బయట రూ. 2 వడ్డీకి అప్పులు తెచ్చి మరీ గుడ్డిగా నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. ఇప్పుడు మధ్యతరగతి కొనుగోళ్లకు దూరం కావడంతో పరిస్థితి తలకిందులైంది. నగర నడిబొడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ అవతల వరకు దాదాపు 2 లక్షల రెసిడెన్షియల్ యూనిట్లు కొనేవారు లేక ఖాళీగా పడి ఉన్నాయి. అలాగే 4 కోట్ల SFT కమర్షియల్ స్పేస్, 3 కోట్ల SFT రెసిడెన్షియల్ స్పేస్ అమ్మకాలు లేక స్తంభించిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నగరంలోని ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థలో నెలకు కనీసం నాలుగు అపార్ట్‌మెంట్లు కూడా అమ్ముడుపోని దుస్థితి నెలకొంది. రొటేషన్ పూర్తిగా కుప్పకూలడంతో చిన్న, పెద్ద తేడా లేకుండా బిల్డర్లంతా కొత్త ప్రాజెక్టులను నిలిపివేశారు.

ఏపీతో పాటు మెట్రో నగరాల్లోనూ ఇదే వ్యధ..

ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సరైన ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు లేకపోవడం, వాస్తవ ధరల కంటే ఎక్కువగా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీల కారణంగా రియల్ రంగం పడకేసింది. అమరావతి, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లోనూ క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నీటి ఎద్దడితో బెంగళూరు, చెన్నై, అమెరికాలో ట్రంప్ కఠిన నిబంధనల వల్ల ఎన్ఆర్ఐ పెట్టుబడులు తగ్గి ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనూ రియల్ మార్కెట్ డీలా పడింది. మొత్తానికి ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడి, సగటు వేతనాలు పెరిగి, సామాన్యుడు ధైర్యంగా ఇల్లు కొనే పరిస్థితి వస్తే తప్ప రియల్ ఎస్టేట్ కోలుకోలేదని, ఇందుకు కనీసం మరో మూడేళ్లు పట్టొచ్చని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

తర్వాత చదవండి