తెలంగాణ

మహిళల పేదరికమే వారి పెట్టుబడి.. అండాలకూ రేటు కట్టేశారు.. ఎంత దారుణం?

ఓ వైపు పేదరికం. మరోవైపు అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిదండ్రులను కాపాడుకోవాలనే ఆశ. ఇంటి నిండా కష్టాలు. అలాంటి మహిళలకు మరో దారి కనిపించలేదు. ఎలాగైనా బతకాలి. తమ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ రెండే వారి ముందు కనిపించాయి. సరిగ్గా వారి కష్టాలే బ్రోకర్లకు అవకాశంగా మారాయి. హైదరాబాద్ లో వెలుగు చూసిన అక్రమ అండాల వ్యాపారం వెనుక కనిపిస్తున్న కథ ఇదే.

అండాల వ్యాపారం వెనుక దారుణాలు

మహిళల పేదరికమే.. వాళ్లకు వ్యాపారం

హైదరాబాద్ ఘటనలో విస్తుపోయే వాస్తవాలు

అసలు.. మానవత్వమే లేదా..?

ఓ వైపు పేదరికం. మరోవైపు అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిదండ్రులను కాపాడుకోవాలనే ఆశ. ఇంటి నిండా కష్టాలు. అలాంటి మహిళలకు మరో దారి కనిపించలేదు. ఎలాగైనా బతకాలి. తమ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ రెండే వారి ముందు కనిపించాయి. సరిగ్గా వారి కష్టాలే బ్రోకర్లకు అవకాశంగా మారాయి. హైదరాబాద్ లో వెలుగు చూసిన అక్రమ అండాల వ్యాపారం వెనుక కనిపిస్తున్న కథ ఇదే.

ఇంట్లో తండ్రి ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆసుపత్రి ఖర్చులు పెరిగిపోతున్నాయి. అప్పులు ఇచ్చినవాళ్ల ఒత్తిడి ఎక్కువవుతోంది. తల్లి కూలి పనులకు వెళ్తోంది. చదువుకుంటున్న తమ్ముళ్లు, చెల్లెళ్లు ఉన్నారు. ఆ కుటుంబానికి ఇప్పుడు డబ్బు అవసరం. ఎంత చిన్న మొత్తమైనా పెద్ద సాయమే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న 25 ఏళ్ల యువతికి ఒక ప్రతిపాదన వచ్చింది. అండాలు ఇస్తే రూ.50 వేలు ఇస్తామన్నారు. ఆ డబ్బుతో తండ్రి వైద్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని ఆమె అనుకుంది. హైదరాబాద్‌కు బయలుదేరింది.

కానీ ఆమెకు తెలియని విషయం ఒకటుంది. తన కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆశతో వస్తున్న ఆమె.. తన శరీరం మరొకరి వ్యాపారానికి పెట్టుబడిగా మారబోతోందని. ఇది ఒక్క యువతి కథ కాదు. హైదరాబాద్‌లో వెలుగుచూసిన అక్రమ అండాల సేకరణ వ్యవహారంలో బయటపడిన అనేక మంది మహిళల పరిస్థితి. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు. వేర్వేరు కుటుంబ సమస్యలు. కానీ అందరినీ ఒకచోటుకు చేర్చిన అంశం మాత్రం ఒక్కటే. డబ్బు అవసరం.

పేదరికానికి ఒక ధర.. మహిళ శరీరానికి మరో ధర!

మన సమాజంలో మహిళలు తమ కుటుంబాల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. పిల్లల చదువుల కోసం, భర్త అప్పుల కోసం, తల్లిదండ్రుల వైద్యం కోసం తమ అవసరాలను పక్కన పెడుతుంటారు. కానీ కుటుంబాన్ని ఆదుకోవాలనే బాధ్యతే ఒక మహిళను ఆమె శరీరాన్ని ప్రమాదంలో పెట్టే పరిస్థితికి నెడితే..?

ఈ వ్యవహారంలో బ్రోకర్లు చేసిన పని ఇదేనన్నది ప్రధాన ఆరోపణ. పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలను గుర్తించడం, డబ్బు ఆశ చూపించడం, హైదరాబాద్‌కు తీసుకురావడం.. ఇలా ఒక నెట్‌వర్క్ పనిచేసినట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది.

ఒక్కో మహిళకు అండాల సేకరణ ప్రక్రియకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తామనే ఆశ చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరికి ఇది అప్పుల నుంచి బయటపడే మార్గంగా కనిపించింది. మరికొందరికి కుటుంబ అవసరాలు తీర్చుకునే అవకాశంగా అనిపించింది.

కానీ దీని వెనుక ఉన్న హెల్త్ రిస్కులు, హార్మోన్ ఇంజెక్షన్ల ప్రభావం, భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి వారికి ఎంతవరకు వివరించారు? నిజంగా వారు దీనిని స్వచ్ఛందంగా అంగీకరించారా? లేక ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారి నిర్ణయాలను ప్రభావితం చేశారా? ఇవే ఈ వ్యవహారంలో కీలకమైన ప్రశ్నలు.

ఒకవైపు రూ.50 వేలు.. మరోవైపు లక్షల వ్యాపారం!

ఈ మొత్తం కథలో అసలు ఆందోళన కలిగించే అంశం డబ్బు లెక్కలు. అండాలు ఇచ్చే మహిళకు కొంత మొత్తం చెల్లిస్తే, అండాలు అవసరమైన వారి నుంచి ఒక్కో ప్రక్రియకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలకు పైగానే వసూలు చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే అండాల దానం ద్వారా సంతానం లేని దంపతులకు సాయం చేయడం తప్పు కాదు. అది చట్టబద్ధమైన వైద్య విధానంలో భాగం. కానీ మహిళల ఆరోగ్యాన్ని, చట్టపరమైన నిబంధనలను పక్కనపెట్టి ఈ ప్రక్రియను వ్యాపారంగా మార్చడం మాత్రం తీవ్రమైన సమస్య.

ఒకే మహిళతో మళ్లీ మళ్లీ ప్రయోగాలా?

ఈ వ్యవహారంలో నకిలీ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాల అంశం మరింత ఆందోళన కలిగించింది. అండాల దాతల వివరాలు, గతంలో దానం చేశారా లేదా అనే సమాచారం వైద్య వ్యవస్థలో సరిగ్గా ఉండాలి. కానీ ఐడెంటీ కార్డులను మార్చి రూల్స్ ని తప్పించుకునే ప్రయత్నం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

భారతదేశంలోని ART చట్టం ప్రకారం అండాల దాత వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జీవితకాలంలో ఒక్కసారే అండాల దానం చేయాలి. ఒకసారి గరిష్ఠంగా ఏడు అండాలను మాత్రమే సేకరించాలి. దాతకు వైద్యపరమైన భద్రత, అవసరమైన బీమా కల్పించాలి.

ఈ నిబంధనలు ఎందుకు పెట్టారు? మహిళల ఆరోగ్యం దెబ్బతినకుండా చూడటానికి. హార్మోన్ ఇంజెక్షన్లతో అండాశయాలను ఉత్తేజితం చేసే ప్రక్రియకు వైద్య పర్యవేక్షణ అవసరం. అండాల సేకరణకు కూడా వైద్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరి. మరి డబ్బు కోసం ఈ నిబంధనలను పక్కనపెడితే? ఒక మహిళకు ఇప్పటికే జరిగిన ప్రక్రియను దాచిపెట్టి మళ్లీ చికిత్స చేస్తే? ఆమె ఆరోగ్యానికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? ఇక్కడ అండాల సంఖ్య కంటే మహిళ ఆరోగ్యమే ముఖ్యం. కానీ అక్రమ వ్యాపారంలో ఈ రూల్స్ ఫాలో అయ్యే వారెవరు..?

అసలు అండాలను ఎలా సేకరిస్తారు?

మహిళల నుంచి అండాలను సేకరించే ప్రక్రియను వైద్య పరిభాషలో ఎగ్ రిట్రీవల్ (Egg Retrieval) అంటారు. ముందుగా అండాశయాల్లో ఒకటి కంటే ఎక్కువ అండాలు పరిపక్వం చెందేలా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. డాక్టర్ల సూపర్విజన్ లో స్కానింగ్ ద్వారా అండాల ఎదుగుదలను గమనిస్తారు. అవి సేకరణకు సిద్ధమైన తర్వాత అనస్థీషియా ఇచ్చి, అల్ట్రాసౌండ్ సహాయంతో సన్నని సూదిని అండాశయాల్లోకి పంపిస్తారు. ఫాలికల్స్‌లోని ద్రవంతో పాటు అండాలను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తారు. ఈ ప్రక్రియ సాధారణంగా 15–30 నిమిషాల్లో పూర్తవుతుంది. అయితే హార్మోన్ చికిత్స, అండాల సేకరణ వల్ల కొందరిలో పెయిన్, బ్లీడింగ్, ఇన్ఫెక్షన్, అండాశయాలు అతిగా స్పందించే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అండాల సేకరణ వెనుక ఇంత కథ ఉంది.

అమ్మ కావాలనే ఆశ కూడా వ్యాపారానికి పెట్టుబడేనా?

ఈ కథలో ఇదే అత్యంత కీలకం. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులే ఇలాంటి బ్రోకర్లకు అవకాశం. పెళ్లయి ఏళ్లు గడిచినా పిల్లలు కలగకపోతే ఆ కుటుంబం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి అంతా ఇంతా కాదు. బంధువుల ప్రశ్నలు, సమాజం నుంచి వచ్చే మాటలు, ప్రతి పండుగలో ఎదురయ్యే బాధ.. ఇవన్నీ భరించడం ఈజీ కాదు. కొందరు ఎన్నో ఆసుపత్రులు తిరుగుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. చివరకు IVF చికిత్సను ఆశ్రయిస్తారు. వారికి కావాల్సింది ఒక బిడ్డ. తమ ఇంట్లో కూడా చిన్నారి నవ్వులు కనిపించాలనే కోరిక.

అలాంటి ఆశతో వైద్య కేంద్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రతి ప్రక్రియ చట్టబద్ధంగా, పారదర్శకంగా జరుగుతుందని నమ్ముతారు. అండాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దాతకు సరైన పరీక్షలు జరిగాయా? అవసరమైన అనుమతులు ఉన్నాయా? అన్న విషయాలను తెలుసుకునే హక్కు వారికి ఉంది. ఒక మహిళ పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అండాలను సేకరించినా, మరో కుటుంబం మాతృత్వపు ఆశను ఆసరాగా చేసుకుని డబ్బు వసూలు చేసినా.. చివరికి నష్టపోయేది మనుషులే.

ఈ వ్యవహారంలో బాధ్యత ఎవరిది?

హైదరాబాద్‌లో ఈ వ్యవహారం బయటపడిన తర్వాత బ్రోకర్లు, మహిళలను సమీకరించిన వ్యక్తులు మాత్రమే కాదు.. అండాల సేకరణ ప్రక్రియతో సంబంధం ఉన్న ART బ్యాంకులు, ఫెర్టిలిటీ కేంద్రాల పాత్రపైనా ప్రశ్నలు తలెత్తాయి. వైద్య కేంద్రాలకు మహిళలను ఎవరు తీసుకొచ్చారు? వారి హెల్త్ హిస్టరీని ఎవరు చెక్ చేశారు..? హార్మోన్ ఇంజెక్షన్లు ఎవరి సూపర్ విజన్ లో ఇచ్చారు? దాతల గుర్తింపును ఎలా నిర్ధారించారు? సేకరించిన అండాలను ఎక్కడికి పంపించారు? ఈ ప్రక్రియలో డబ్బు ఎవరెవరికి చేరింది? ఇవన్నీ తేలాల్సిన ప్రశ్నలే. ఐతే ప్రతి IVF కేంద్రాన్ని అనుమానించడం సరికాదు. చట్టబద్ధంగా సేవలు అందిస్తున్న వైద్య సంస్థలపై కూడా ఇలాంటి అక్రమ వ్యవహారాలు ప్రభావం చూపుతాయి. అందుకే తప్పు చేసిన వ్యక్తులు, సంస్థలు ఏవైనా సరే.. వారిని కఠినంగా శిక్షించాల్సిందే.

తర్వాత చదవండి