సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిద్దిపేటలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన అక్కడకు చేరుకుంటారని తెలిసింది. హెలికాప్టర్ ద్వారా సిద్దిపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇదే వేదికగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నేడు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నారు.
అంతేకాకుండా లబ్ధిదారులకు చేయూత పింఛన్లు, మహిళలకు ఇందిరమ్మ చీరలను సైతం ఇదే వేదికగా పంపిణీ చేయాల్సి ఉండగా, అది కాస్త ఈనెల 26కు వాయిదా పడినట్టు సమాచారం. ఇక సంక్షేమ పథకాల ప్రారంభానికి ముందు జిల్లాలో రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇప్పటికే అభివృద్ధి పూర్తయిన వాటిని ప్రారంభించనున్నారు.
ఇందిరమ్మ జయంతి కానుకగా..
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అంకింత ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అందుకే నేడు సిద్దిపేట వేదికగా రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమాను వర్తింపజేయనున్నారు. కుటుంబంలో ఎవరు మరణించిన రూ.5 లక్షల జీవిత బీమా కవరేజ్‌ను ప్రభుత్వం బాధిత కుటుంబంలోని వారికి అందజేయనుంది. నేటి నుంచి నెల రోజుల పాటు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఉపాధి హామీ కూలీలు, తక్కువ ఆదాయం ఉన్నవారికే మాత్రమే ఈ పథకం వర్తించనుంది.
సీఎం సభకు భారీగా జనసమీకరణ..
సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభ కోసం 25 నియోజకవర్గాల నుంచి ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నట్టు సమాచారం.సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, కరీంనగర్, హుజురాబాద్, కోరుట్ల, జగిత్యాల, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, ఆలేరు, భువనగిరి, జనగామ, మేడ్చల్, మల్కాజ్గిరి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జనాలను సీఎం సభకోసమే సమీకరించినట్టు తెలుస్తోంది.
అయితే, సీఎం సభ కోసం సిద్దిపేట పట్టణం చుట్టూ భారీ ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్, ఆర్టీసీ బస్సుల తరలింపుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదని, సీఎం సభ కోసం జనాలను ఇబ్బంది పెడుతారా? అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
