TG: సిద్దిపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం ప్రసంగం ఆద్యంతం ప్రజల సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలు లేకుండా కేవలం వ్యక్తిగత దూషణలు, ప్రగల్భాలతోనే సాగిందని ఆయన మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యల్లో ఎలాంటి బలం లేదని, ఆయన పాలనలో విజన్ కనిపించడం లేదని విమర్శించారు. కరువుతో అల్లాడుతున్న రైతులకు ఈ సభ ద్వారా ఎలాంటి భరోసా దక్కలేదని, సిద్దిపేటకు రావాల్సిన రూ.1,070 కోట్ల పెండింగ్ పనుల గురించి గానీ, ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసు గానీ సీఎం ఎత్తలేదని హరీశ్ రావు నిలదీశారు.
తాడి చెట్టు వ్యాఖ్యలపై ఆగ్రహం..
తనను ఉద్దేశించి సీఎం చేసిన 'తాడి చెట్టు', 'గడ్డం' వ్యాఖ్యలను బాడీ షేమింగ్‌గా పేర్కొన్న హరీశ్ రావు.. భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడి చెట్టు అంత ఎత్తుకు ఎదుగుతుందని, ఎలాంటి తుఫాన్లు, ఈదురు గాలులు వచ్చినా ఉక్కులా తట్టుకుని నిలబడుతుందని బదులిచ్చారు. కరువులో మొలిచే పిచ్చి మొక్కలకు తాడి చెట్టు విలువ ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. గౌడన్నల కల్పతరువైన తాడి చెట్టును పదేపదే కించపరిచేలా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వంట అయ్యాక గరిటె తిప్పినట్లుంది..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు, ఇతర అభివృద్ధి పనులకు పేర్లు మార్చి రిబ్బన్లు కట్ చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని హరీశ్ రావు ఆరోపించారు. వంట అంతా పూర్తయ్యాక గరిటె తిప్పి ఘనతంతా తనదే అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పథకాలేవీ రద్దు చేయలేదని సీఎం అబద్ధాలు చెబుతున్నారని మండిపడుతూ.. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రీయింబర్స్మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెలు-చేపల పంపిణీ, మన ఊరు-మన బడి, కంటి వెలుగు వంటి ఎన్నో పథకాలను ఎందుకు నిలిపివేశారో చెప్పాలని నిలదీశారు.
పార్టీ మార్పు ఒట్లు, శంకరమ్మ ఓటమిపై నిలదీత
పార్టీ మారబోనని తనను ఒట్టేయమని సీఎం అడగటంపై స్పందిస్తూ.. "జిన్నా వచ్చి గాంధీ దేశభక్తిని ప్రశ్నించినట్లుంది" అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. దేవుళ్ల మీద ఒట్లు వేసి రైతన్నలను మోసం చేశారని ఆరోపించారు. అలాగే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్‌చారి తల్లి శంకరమ్మకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, ఆమెను ఓడించింది ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. క్యాన్సర్ బారిన పడ్డ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డిని అమెరికా పంపి కోట్లు ఖర్చు చేసి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్ అని గుర్తు చేస్తూ, ఆయనపై విమర్శలు చేయడం సూర్యుడిపై ఉమ్మేయడమేనని హరీశ్ రావు స్పష్టం చేశారు.
