తెలంగాణ

TG: 2029లో సిద్దిపేటలో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే.. అతనికే టికెట్‌ ఇస్తా : సీఎం రేవంత్

TG: వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగానే కాదు, సిద్దిపేట నియోజకవర్గంలోనూ ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట పట్టణంలో రూ.550 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

TG: వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగానే కాదు, సిద్దిపేట నియోజకవర్గంలోనూ ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట పట్టణంలో రూ.550 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని కార్యకర్తలు నిరూపించారని పేర్కొన్న సీఎం.. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఎవరిని కోరుకుంటే ఆ నాయకుడికే కాంగ్రెస్ టికెట్ ఇస్తానని ప్రకటించారు. అంతేకాకుండా, సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి కూడా కట్టబెడతానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

హరీశ్‌రావు రాజకీయ ప్రస్థానం, ఆస్తులపై సీఎం విమర్శలు

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాలపై సీఎం రేవంత్‌రెడ్డి పలు విమర్శలు చేశారు. 2004లో కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని హరీశ్‌రావు, నాడు వైఎస్సార్ ఇచ్చిన అవకాశంతోనే మంత్రి అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి పదవి దక్కిన తర్వాత సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలని హరీశ్‌రావు ప్రయత్నించారని ఆరోపించారు. ఉద్యమంలో పనిచేసిన సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి కనీసం సొంత కారు కూడా లేకపోతే.. హరీశ్‌రావు, కేసీఆర్, కేటీఆర్ కుటుంబాలకు వేల కోట్ల ఆస్తులు, రంగనాయక్‌సాగర్, జన్వాడ, కొండపోచమ్మ ప్రాంతాల్లో వందల ఎకరాల ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్‌చారి తల్లికి పదేళ్ల పాటు ఏ పదవీ ఇవ్వని కేసీఆర్, తన కుటుంబ సభ్యులకు, బంధువులకు మాత్రం పదవులు ఇచ్చుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ప్రాజెక్టులు, కృష్ణా జలాలపై ఆరోపణలు

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల పన్నుల రూపంలో రూ.20 లక్షల కోట్లు సమకూరగా, ప్రాజెక్టుల పేరుతో మరో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకల వల్లే 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు ఆధ్వర్యంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని విమర్శించారు. అలాగే తనపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు రేవంత్‌రెడ్డి బదులిచ్చారు. తెలుగుదేశం పార్టీతో తాను ఏనాడో తెగదెంపులు చేసుకున్నానని, ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టింది కేసీఆర్, హరీశ్‌రావు కాదా అని ప్రశ్నించారు. గతంలో ఏపీ సీఎం జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి విందు ఇచ్చి రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించింది, రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని రాయలసీమ రతనాల సీమ కావాలని ఆకాంక్షించింది కేసీఆర్ కాదా అని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు.

తర్వాత చదవండి