తెలంగాణ

Brs Vs Congress: హన్మకొండలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ

Brs Vs Congress: హన్మకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణకు దిగాయి. హన్మకొండ అభివృద్ధిపై ఇరువర్గాలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నాయి.

Brs Vs Congress: హన్మకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణకు దిగాయి. హన్మకొండ అభివృద్ధిపై ఇరువర్గాలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. హన్మకొండ చౌరస్తా వేదికగా చర్చకు సై అంటూ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చిద్దాం.. దమ్ముంటే రండి.. అంటూ ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా హనుమకొండ చౌరస్తాకు బయలుదేరడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

అభివృద్ధిపై చర్చకు సవాల్

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో హనుమకొండలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేటీఆర్ నిర్వహించిన జనచైతన్య సభ అనంతరం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.. కేటీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు. అభివృద్ధిపై చర్చించేందుకు హన్మకొండ చౌరస్తాకు రావాలని, దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు.

దమ్ముంటే.. రా

ఈ సవాల్‌పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.. కేటీఆర్‌కు బదులుగా తానే నాయిని రాజేందర్ రెడ్డితో తలపడతానని ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. ఆ ఎన్నికల్లో తాను ఓడిపోతే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రతిసవాల్ విసిరారు. అంతేకాదు.. మంగళవారం సాయంత్రం 5 గంటలకు హన్మకొండ చౌరస్తాకు రావాలని డెడ్‌లైన్ విధించారు. దీంతో అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు.. హనుమకొండ చౌరస్తాకు వెళ్లేందుకు ప్రయత్నించడం, పోలీసులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తతలకు కారణమైంది.

పరస్పరం రాళ్ల దాడులు

మరోవైపు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు. కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను చించేశారు. ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడి చేశాయి. పార్టీ ఆఫీస్ లోకి దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

తర్వాత చదవండి